పదహారేళ్లకే ప్రపంచ నం.1 అయింది!

ఆటల్లో రాణించాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు.. శారీరకంగా, మానసికంగా బలంగా మారి బరిలోకి దిగితేనే విజయం వరిస్తుంది.. ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది గుజరాత్‌కు చెందిన అండర్‌-19 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి తస్నిమ్‌ మిర్‌. పదహారేళ్ల ఈ అమ్మాయి ఈ క్రీడలో ‘రాకెట్‌’లా దూసుకుపోతోంది.

Updated : 14 Jan 2022 19:16 IST

(Photo: Twitter)

ఆటల్లో రాణించాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు.. శారీరకంగా, మానసికంగా బలంగా మారి బరిలోకి దిగితేనే విజయం వరిస్తుంది.. ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది గుజరాత్‌కు చెందిన అండర్‌-19 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి తస్నిమ్‌ మిర్‌. పదహారేళ్ల ఈ అమ్మాయి ఈ క్రీడలో ‘రాకెట్‌’లా దూసుకుపోతోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై టైటిళ్ల వేట కొనసాగిస్తోంది. ఇదే ఊపు ప్రస్తుతం ఆమెను ప్రపంచ నం.1గా నిలబెట్టింది. తాజాగా ప్రకటించిన అండర్‌-19 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది తస్నిమ్‌. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు కూడా ఆమే! గతంలో సైనా, సింధులకు కూడా సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను అందుకున్న ఈ యువ షట్లర్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

తస్నిమ్‌ మిర్‌.. గుజరాత్‌లో పుట్టి పెరిగింది. బ్యాడ్మింటన్‌ కోచ్‌ అయిన తన తండ్రి ఇర్ఫాన్‌ మిర్‌ను చూసి ఈ క్రీడ పట్ల ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఆరేళ్ల వయసు నుంచే రాకెట్‌ చేతపట్టింది. తన తండ్రి వద్దే ఆటలో ఓనమాలు నేర్చుకున్న తస్నిమ్‌.. ఇంతింతై అన్నట్లుగా బ్యాడ్మింటన్‌లో ఆరితేరింది.

నాన్న వద్దే ఓనమాలు!

‘నాన్న మెహెసానా పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే బ్యాడ్మింటన్‌లోనూ శిక్షణ ఇస్తుంటారు. చిన్నతనంలో నన్ను కూడా ఆయనతో పాటు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లేవారు. అలా క్రీడ పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాకు ఆరేళ్లొచ్చాక నాన్నే నాకు బ్యాడ్మింటన్‌లో కోచింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా దేశ, విదేశీ టోర్నమెంట్లలో మొత్తంగా 22 టైటిళ్లు నెగ్గా..’ అంటోందీ యువకెరటం. 14 ఏళ్ల వయసులో ‘అండర్‌-19 జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌’గా నిలిచిన తస్నిమ్‌.. అండర్‌-13, అండర్‌-15, అండర్‌-19 అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలోనూ పలు టైటిళ్లు సొంతం చేసుకుంది. మరోవైపు డబుల్స్‌ విభాగంలోనూ సత్తా చాటుతోంది.

వాళ్లనే మించిపోయింది!

కరోనా ప్రభావం క్రీడా రంగంపై పడినా.. కఠిన శిక్షణ, మానసిక దృఢత్వంతో ఆ సమయంలోనూ మూడు టైటిళ్లు గెలుచుకుంది తస్నిమ్‌. ఈ ప్రతిభే తాజాగా ప్రకటించిన అండర్‌-19 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అమ్మాయిల సింగిల్స్‌ విభాగంలో తను టాప్‌ ర్యాంక్‌ దక్కించుకునేలా చేసింది.

‘మొదటి ర్యాంక్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. కొవిడ్‌ ప్రభావం టోర్నమెంట్లపై పడడంతో ప్రపంచ నం.1గా నిలుస్తానో, లేదోనని సందేహించా. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో బల్గేరియా, ఫ్రాన్స్‌, బెల్జియంలలో నిర్వహించిన కీలక పోటీల్లో గెలిచా. అందుకు తాజాగా ప్రతిఫలం దక్కింది..’ అంటోందీ యూత్‌ ఐకాన్‌. బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన తస్నిమ్‌.. తాజా ర్యాంక్‌తో వాళ్లకు సాధ్యం కాని ఫీట్‌ను కూడా అందుకుంది. 2011లో ప్రవేశ పెట్టిన అండర్‌-19 బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో.. అప్పట్లో సింధు రెండో ర్యాంక్‌ కైవసం చేసుకోగా.. సైనా అప్పటికే జూనియర్ స్థాయి దాటిపోయింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా కీర్తిని మూటగట్టుకుంది తస్నిమ్.

అందుకే పురుషులతో ఆడతా!

గత నాలుగేళ్లుగా గువహటిలోని ‘అసోం బ్యాడ్మింటన్‌ అకాడమీ’లో శిక్షణ తీసుకుంటోన్న తస్నిమ్‌.. తన ఆటతీరును మరింత మెరుగుపరచుకోవడానికే పురుష క్రీడాకారులతో సాధన చేస్తున్నానంటోంది. ‘ప్రస్తుతం ఇండోనేషియా కోచ్‌ ఎడ్విన్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నా. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు శిక్షణతోనే సరిపోతుంది. నా క్రీడా నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడానికి పురుష క్రీడాకారులతో సాధన చేస్తున్నా. నేను ఈ క్రీడలో రాణించడానికి మా అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వాళ్లు నా ఆట కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే సీనియర్‌ క్రీడాకారుల పోటీలను కూడా తరచూ చూస్తుంటా. నా మార్గదర్శకులు సైనా, సింధులా ఏదో ఒక రోజు దేశానికి ఒలింపిక్‌ పతకం తీసుకొస్తానన్న నమ్మకం నాకుంది..’ అంటోందీ యువ క్రీడాకారిణి. ప్రస్తుతం తస్నిమ్‌ సాధించిన ఈ ఘనతను దేశమంతా కొనియాడుతోంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆమెను ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నప్పుడే ఆటపై పట్టు సాధించగలం అంటోన్న తస్నిమ్‌.. తాను కొట్టే షాట్స్‌ తనలో ఆత్మవిశ్వాసం నింపుతాయని చెబుతోంది.

ఇకపైనా ఈ డ్యాషింగ్‌ ప్లేయర్‌ తన ఆటలో ఇదే ఊపును కొనసాగిస్తూ.. తన ఒలింపిక్‌ కలను నెరవేర్చుకోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

గుడ్‌ లక్‌ తస్నిమ్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్