నిజ జీవితంలో అమ్మలు అలా ఉండరు..!

సాధారణంగా సినిమాలు, సీరియల్స్‌లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు.

Published : 12 Aug 2021 17:12 IST

(Photo: Instagram)

సాధారణంగా సినిమాలు, సీరియల్స్‌లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో అమ్మ పాత్ర ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందంటోంది యువ దర్శకురాలు నిశ్చల్‌ శర్మ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా క్షణం కూడా తీరిక లేకుండా, తనకంటూ కాస్త సమయం కేటాయించుకునే వీల్లేకుండా, ఎన్నో బాధ్యతల్ని భుజాన మోస్తూ మహిళలు తమ రోజుల్ని అతి భారంగా గడిపేస్తుంటారు. అలాంటి గృహిణుల బిజీ లైఫ్స్టైల్‌ని తెర మీద చూపేందుకు ‘రిమి’ పేరుతో ఓ లఘుచిత్రాన్ని రూపొందించిందామె. మహిళల రోజువారీ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఇప్పటికే ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. IFFSA, RIFFA.. వంటి చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. మరి, విమర్శకుల ప్రశంసలందుకుంటోన్న తన లఘుచిత్రం గురించి నిశ్చల్‌ ఏమంటుందో తెలుసుకుందాం రండి..

నిశ్చల్‌ శర్మ.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం లండన్‌లోని మెట్‌ఫిల్మ్‌ స్కూల్లో ఫిల్మ్‌ డైరెక్షన్‌ విభాగంలో మాస్టర్స్‌ చదువుతోంది. చుట్టూ జరుగుతోన్న సామాజిక అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం చిన్ననాటి నుంచే అలవాటు చేసుకున్న ఆమె.. అవే విషయాల్ని కళ్లకు కట్టినట్లుగా తెర మీద చూపించాలని కలలు కనేది. అందుకే 14 ఏళ్ల ప్రాయం నుంచే లఘుచిత్రాలు రూపొందించడం మొదలుపెట్టిందామె. ఎలాగైనా ఈ సమాజంలోని వివక్షను పారదోలాలని, మనుషుల ఆలోచనల్లో మార్పు తేవాలని కంకణం కట్టుకున్న ఆమె.. ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలంటే సినిమాలే అందుకు సరైన వేదిక అంటోంది.

సమాజమే నా కథలకు స్ఫూర్తి!

మన చుట్టూ నిత్యం ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనకు తెలిసినా.. తెలియనివి మరెన్నో ఉంటాయి. అలాంటి అరుదైన విషయాలను, వాటిలోని నిజానిజాల్ని అందరికీ తెలియజెప్పి.. ఈ సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానంటోంది 22 ఏళ్ల నిశ్చల్‌. అందుకే తన లఘుచిత్రాలకు కావాల్సిన కథల్ని సమాజం నుంచే సేకరిస్తున్నానంటోంది.

‘సామాజిక అంశాలపై రూపొందించే సినిమాలు ఎంతోమందిని ప్రభావితం చేస్తాయి. అలాంటి కథలు నా దగ్గర బోలెడన్ని ఉన్నాయి. లండన్‌లోని సెక్స్‌ వర్కర్లపై ఓ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది. అయితే అంతలోనే లాక్‌డౌన్‌ విధించడంతో గతేడాదే ఇండియాకు తిరిగొచ్చా..’ అంటోంది.

అమ్మను చూశాకే ఆ ఆలోచన!

ఇంటికొచ్చినా సినిమాల ఆలోచన మానలేదంటోంది నిశ్చల్‌. ఈ క్రమంలో ‘రిమి’ షార్ట్‌ఫిల్మ్‌ రూపొందించడానికి తన తల్లే కారణమంటోంది. ‘గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికొచ్చినప్పట్నుంచి అమ్మ చేసే రోజువారీ పనుల్ని దగ్గర్నుంచి గమనిస్తుండేదాన్ని. క్షణం తీరిక లేకుండా ఇంటి పనుల్లో, మమ్మల్ని చూసుకోవడంలోనే తను నిమగ్నమైపోయేది. ఇలా ఎంతోమంది గృహిణులు, మహిళలు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్న విషయం నాకు అవగతమైంది. అయితే చాలా సినిమాల్లో అమ్మ పాత్రను కల్పితంగా చూపిస్తుంటారు. కానీ నేను మాత్రం ఆమె నిజ జీవితాన్ని తెరకెక్కించాలనుకున్నా. దానికి ప్రతిరూపమే ఈ ‘రిమి’ లఘుచిత్రం..’ అంటూ తన ఆలోచన గురించి చెప్పుకొచ్చింది నిశ్చల్‌. తన స్నేహితులే ప్రొడక్షన్‌ టీమ్‌గా ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించిందామె.

అసలేంటీ కథ?

13 నిమిషాల నిడివి గల ఈ లఘుచిత్రంలో ఇంటి పనుల రీత్యా ఓ మహిళ బిజీ లైఫ్‌స్టైల్, కుటుంబం కోసం తాను చేసే త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే అదే సమయంలో ఓ మహిళగా తనకంటూ కొన్ని ఆలోచనలు, కోరికలు ఉంటాయన్న విషయాన్ని కూడా తెరమీదకు తెచ్చింది నిశ్చల్‌. ఈ క్రమంలో రియా అనే ఓ సెల్ఫ్‌ లవ్‌ అమ్మాయి పాత్రను పరిచయం చేసి.. ఆమె స్ఫూర్తితో రిమి తన మనసు లోతుల్లో ఉండే ఇష్టాల్ని, అభిరుచుల్ని తెలుసుకునేలా చేస్తుంది. ఇక అప్పట్నుంచి తనను తాను ప్రేమించుకోవడం, తనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం, తన అభిరుచుల్ని నెరవేర్చుకోవడం.. వంటివన్నీ చేస్తుంటుంది రిమి. ఇలా మహిళలకు ఇల్లే లోకం కాదని, వాళ్లూ తమకు ప్రైవసీ కావాలని కోరుకుంటారని తన లఘుచిత్రంతో చెప్పకనే చెప్పింది నిశ్చల్‌. అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని.. తద్వారా సమాజంలోని మహిళల్లో మార్పు తీసుకురావాలని కోరుకుంటోందామె. అప్పుడే మహిళలపై ఉన్న వివక్ష, చిన్న చూపు చూడడం.. వంటివి కాస్తైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటోందీ హైదరాబాదీ.

అంతర్జాతీయ గుర్తింపు!

ఇందులో రిమిగా దీపా కిరణ్‌, రియాగా మాన్సీ నటించారు. లాక్‌డౌన్‌లోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ షార్ట్‌ఫిల్మ్‌.. ఈ ఏడాది జర్మనీలోని Stuttgart సిటీ వేదికగా నిర్వహించిన ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితమైంది. ఇక IFFSA (టొరంటో), RIFFA వంటి చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. అంతేకాదు.. ఈ ఏడాది జరిగిన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో భాగంగా ‘ఉత్తమ స్క్రీన్‌ప్లే’ అవార్డును కూడా అందుకుందీ షార్ట్‌ఫిల్మ్‌. యువ దర్శకురాలిగా గతంలో పలు లఘుచిత్రాలు, యాడ్స్‌ రూపొందించింది నిశ్చల్‌. సైబర్‌ బుల్లీయింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘అహన’, ఛాయ్‌ లవర్స్‌ కోసం ‘అంకుల్‌, దో ఛాయ్‌’, ‘స్కార్స్‌’ పేరుతో గృహ హింసపై రూపొందించిన విజువల్‌ పోయెమ్‌, ‘జెనెసిస్‌’ అనే యాడ్‌ ఫిల్మ్‌.. వంటివి ఆమె డైరెక్షన్‌ ఖాతాలో ఉన్నాయి.

తన దర్శకత్వ ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించిన నిశ్చల్‌.. ‘ఆడవాళ్ల జీవితాలను కొందరు పురుష దర్శకులు ఇప్పటికే తెరమీదకు తెచ్చినప్పటికీ.. ఇలాంటి కథ ఓ మహిళ నుంచి వచ్చినప్పుడే అది ఎక్కువ మందికి చేరగలుగుతుందని నేను నమ్ముతాను’ అంటోంది.

మరి, నిశ్చల్‌ చెప్పినట్లు.. మహిళలు తమకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. దీనిపై మీరేమంటారు? అతివలు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే.. తమ కోసం కాస్త సమయం కేటాయించుకోవాలంటే ఏం చేయాలి? ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సహకారం/ప్రోత్సాహం ఎంత వరకు ఉండాలి? ఇలాంటి స్వీయ ప్రేమ వల్ల వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను మాతో పంచుకోండి! ఈ విషయంలో ఇతర మహిళల్లో స్ఫూర్తి రగిలించండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్