‘కొబ్బరి చిప్ప’లతో లక్షల వ్యాపారం!

సాధారణంగా కొబ్బరి కాయ కొడితే మనమైతే ఏం చేస్తాం? కొబ్బరి తిని, చిప్ప పడేస్తుంటాం. కానీ కేరళకు చెందిన మరియా

Updated : 29 Feb 2024 16:48 IST


(photo: instagram)

సాధారణంగా కొబ్బరి కాయ కొడితే మనమైతే ఏం చేస్తాం? కొబ్బరి తిని, చిప్ప పడేస్తుంటాం. కానీ కేరళకు చెందిన మరియా కురియకోస్ మాత్రం ఈ చిప్పలతో ఆకర్షణీయమైన పాత్రలు తయారుచేస్తోంది. వాటిని అందమైన అలంకరణ వస్తువులుగా మలుస్తోంది. కాదేదీ కళకనర్హం అన్నట్లు.. కొబ్బరి చిప్పతో తయారుచేయలేని వస్తువేదీ లేదంటూ తనలోని సృజనను చాటుకుంటోంది. ఈ వ్యాపారంతో నెలనెలా లక్షల కొద్దీ ఆదాయాన్ని గడిస్తోంది.

ప్రతి ఒక్కరికీ చిన్నతనంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అలా తనకు వ్యాపారం చేయాలన్న తపన ఉండేదంటోంది మరియా. కేరళలోని త్రిస్సూర్‌లో పుట్టిపెరిగిన ఆమె.. విదేశాల్లో ఎంబీఏ పూర్తిచేసింది. ఇండియాకు తిరిగొచ్చాక కొన్నేళ్ల పాటు ఉద్యోగం కూడా చేసింది. అయితే తనువొక చోట మనసొక చోట అన్నట్లు.. వ్యాపారంపై మక్కువతో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది మరియా.

ప్రయత్నిస్తే పోయేదేముంది?!

బిజినెస్‌ అయితే చేయాలనుకుంది.. కానీ ఏ వ్యాపారం చేయాలన్న దానిపై తనకు అప్పటికి పూర్తి స్పష్టత లేదు. ఇదే తరుణంలో ఓసారి స్థానిక కొబ్బరి నూనె మిల్లుకు వెళ్లిందామె. ఈ క్రమంలోనే కొబ్బరి చిప్పల్ని వృథాగా పడేయడం చూసిన మరియా.. వాటినే తన వ్యాపార సూత్రంగా మలచుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అంతర్జాలంలో శోధించింది.. యూట్యూబ్‌లో పలు వీడియోలు కూడా చూసింది.

‘రీసెర్చిలో భాగంగానే కొబ్బరి చిప్పలతో మృదువైన పాత్రలు, వంట సామగ్రి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే నాకు చిన్నప్పట్నుంచే ఓ అలవాటుంది. ఏదైనా అనుకుంటే అది సాధ్యమవుతుందా? లేదా? అని సంకోచించను. ఏదైతే అదవుతుందిలే అని ముందు ఓసారి ప్రయత్నించి చూస్తా.. వ్యాపారంలోనూ ఇదే చేశా. ముందు తక్కువ ధరకే శాండింగ్‌ మెషినరీని కొనుగోలు చేశా. దీంతో చిప్పల బయటి భాగాన్ని మృదువుగా మార్చి.. వివిధ రకాల బౌల్స్‌, పాత్రలు తయారుచేశా. వీటిని ఎగ్జిబిషన్లు, ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా పేజీల్లో అమ్మకానికి ఉంచాను. ఫలితంగా మంచి స్పందన రావడంతో ‘Thenga’ అనే స్టార్టప్‌ని ప్రారంభించా. తెంగ అంటే మలయాళంలో కొబ్బరి అని అర్థం..’

లక్షల ఆదాయం..!

‘అయితే క్రమంగా నా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. బయటి నుంచి వచ్చే ఆర్డర్లను తయారుచేసి ఇవ్వడానికి కొంతమంది కళాకారుల్ని కూడా పెట్టుకున్నా. ప్రస్తుతం మా వద్ద విభిన్న పరిమాణాల్లో బౌల్స్‌, వంట పాత్రలు, స్పూన్స్‌, ఫోర్క్‌లు, టీకప్స్‌, క్యాండిల్స్‌, హ్యాంగింగ్‌ ప్లాంటర్స్‌, కంటెయినర్స్‌, షాట్‌ గ్లాసెస్‌, సోప్‌ కేసెస్‌, టైల్స్‌.. వంటివెన్నో రూపుదిద్దుకుంటున్నాయి. ఇక వీటికి గ్లాసీ లుక్‌ అందించడానికి కొబ్బరి నూనెతో వార్నిష్‌ చేస్తున్నాం.. లేజర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో మరికొన్ని ఉత్పత్తులకు అదనపు హంగులద్దుతున్నాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా నెలకు సుమారు రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తోంది. ఇక నా వ్యాపారంలో అమ్మానాన్న ప్రోత్సాహం, సహకారం కూడా ఎంతో!’ అని తన స్టార్టప్‌ జర్నీ గురించి పంచుకుందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

ఏ పనైనా సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా.. మక్కువతో ప్రయత్నిస్తే తప్పక విజయం వరిస్తుందని తన వ్యాపారంతోనే నిరూపించిన మరియా నేటి తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్