కోటిన్నర.. 64 లక్షలు.. భారీ ప్యాకేజీతో కొలువులు కొల్లగొట్టారు!

ఓవైపు ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించడం, లే-ఆఫ్‌లిచ్చి ఇంటికి పంపించడం.. వంటివి చేస్తుంటే.. మరోవైపు కొన్ని కంపెనీలు ఐఐటీ, ఐఐఎం, నిట్‌.. వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో....

Updated : 12 May 2023 14:09 IST

(Photos: Twitter)

ఓవైపు ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించడం, లే-ఆఫ్‌లిచ్చి ఇంటికి పంపించడం.. వంటివి చేస్తుంటే.. మరోవైపు కొన్ని కంపెనీలు ఐఐటీ, ఐఐఎం, నిట్‌.. వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో కొత్త ట్యాలెంట్ల కోసం ఉద్యోగాల వేట కొనసాగిస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో అద్భుత మేధ కనబరిచిన వారికి.. కళ్లు చెదిరే ప్యాకేజీలు ఆఫర్‌ చేసి మరీ కొలువుల్ని కట్టబెడుతున్నాయి. పాట్నా నిట్‌కు చెందిన అదితీ తివారీ ఇటీవల అలాంటి అరుదైన అవకాశమే అందుకుంది. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోన్న ఆమె.. ఫేస్‌బుక్‌ సంస్థలో రూ. 1.6 కోట్ల భారీ ప్యాకేజీతో కొలువు సంపాదించింది. ఇప్పటివరకు ఈ విద్యాసంస్థ చరిత్రలో ఇంత భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలా అదితినే కాదు.. మరికొంతమంది అమ్మాయిలు కూడా ఈమధ్య భారీ ప్యాకేజీలతో కొలువులు దక్కించుకున్నారు. తమ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. వాళ్ల గురించి తెలుసుకుందాం రండి..

రూ. 1.6 కోట్ల ప్యాకేజీతో..!

అదితి తివారీది జంషెడ్‌పూర్‌. ఆమె తండ్రి సంజయ్‌ తివారీ టాటా స్టీల్‌ సంస్థలో ఉద్యోగి. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తల్లిదండ్రులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడడం, ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండడం.. వంటివి చిన్నతనం నుంచి అదితిపై సానుకూల ప్రభావం చూపాయి. తానూ తన పేరెంట్స్‌లాగే కెరీర్‌లో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరుకుందామె. ఈ ఆలోచనతోనే చదువులో మేటిగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం పాట్నా నిట్‌లో ECE చివరి సంవత్సరం చదువుతోన్న అదితి.. ఇటీవలే ఫేస్‌బుక్‌ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో చురుగ్గా పాల్గొంది. తన ప్రతిభతో ఆ సంస్థలో ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించడమే కాదు.. రూ. 1.6 కోట్ల ప్యాకేజీతో ఈ కొలువుకు ఎంపికైందామె. అంటే.. నెల వేతనం సుమారుగా రూ. 13.33 లక్షలకు పైమాటే! అయితే పాట్నా నిట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్యాకేజీగా రికార్డు సృష్టించింది. గతంలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు అత్యధికంగా రూ. 50-60 లక్షల ప్యాకేజీని అందుకున్నారు. కాగా, రికార్డు స్థాయిలో ప్యాకేజీతో తమ కూతురు ఈ ఉద్యోగానికి ఎంపికైనందుకు అదితి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఇటీవలే ఫేస్‌బుక్‌ నుంచి ఆఫర్‌ లెటర్‌ అందుకున్న ఈ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.. చదువు పూర్తిచేసుకొని త్వరగా ఉద్యోగంలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పుకొచ్చింది.


రూ. 64.61 లక్షలు!

ప్రాంగణ నియామకాల్లో లక్షలు/కోట్ల కొద్దీ ప్యాకేజీలు అందుకోవడమంటే మాటలు కాదు.. రౌండ్ల కొద్దీ రాత పరీక్షలు, ముఖాముఖి పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది.. తమ తెలివితేటలతో సంస్థల్ని మెప్పించాల్సి ఉంటుంది. అలాంటి అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలతో ఇటీవలే మైక్రోసాఫ్ట్‌లో కొలువు సంపాదించింది అవనీ మల్హోత్రా. జైపూర్‌కు చెందిన ఆమె.. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీటెక్‌ పూర్తి చేసింది. ఆపై కొన్నేళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఐఐఎం సంబాల్‌పూర్‌లో ఎంబీఏ చదువుతోన్న అవని.. ఏడాదికి గాను రూ. 64.61 లక్షల వేతనంతో ఈ ఉద్యోగాన్ని కొల్లగొట్టింది. అయితే తన బ్యాచ్‌కు చెందిన ఇతర అమ్మాయిలు గరిష్టంగా రూ. 18.25 లక్షల ప్యాకేజీతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కాగా, అవని వాళ్లందరినీ వెనక్కి నెట్టి భారీ కొలువు దక్కించుకోవడం విశేషం. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసే క్రమంలో తాను సంపాదించిన నైపుణ్యాలే.. ఈ భారీ కొలువు దక్కించుకునేందుకు ఉపయోగపడ్డాయంటోంది అవని.


రూ.64.15 లక్షలు!

తమిళనాడుకు చెందిన రమ్య ఆర్‌ వ్యవసాయాధారిత కుటుంబం నుంచి వచ్చింది. మహిళల చదువుకు అతి తక్కువ ప్రాధాన్యమిచ్చే ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె.. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టింది. చిన్న వయసు నుంచే చదువులో మెరుగ్గా రాణిస్తోన్న ఆమె.. ప్రస్తుతం ఐఐఎం సంబాల్‌పూర్‌లో ఎంబీఏ చదువుతోంది. మేనేజ్‌మెంట్‌, విశ్లేషణాత్మక నైపుణ్యాలు అపారంగా ఉన్న ఆమె.. ఈ కీలక నైపుణ్యాలతోనే ఇటీవలే ప్రాంగణ నియామకాల్లో భారీ ప్యాకేజీతో కొలువు సంపాదించింది. సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ రమ్యకు రూ. 64.15 లక్షల ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆరు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసుకొని ఉద్యోగానికి ఎంపికైన రమ్య.. త్వరలోనే నైజీరియాలో విధుల్లో చేరనుంది.

‘మా గ్రామంలో మహిళలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం చాలా అరుదు. కానీ పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పులొస్తున్నాయి. భవిష్యత్తులో మరింత మంది అమ్మాయిలు ఉన్నత చదువులతో తమ కలలను నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నా. ఇక ఇంత భారీ ప్యాకేజీతో నేను ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగానంటే ఆ క్రెడిట్‌ మా అమ్మానాన్నలకే దక్కుతుంది. ఇద్దరూ రైతులే అయినా.. చదువు విషయంలో నన్ను ప్రోత్సహించారు. నాకు నచ్చింది చేస్తానంటే వెన్నుతట్టారు. కష్టపడ్డాను.. ఫలితం దక్కింది..’ అంటోంది రమ్య.


రూ. 58.3 లక్షలు

ప్రైవేటు విద్యాసంస్థల్లో లక్షల కొద్దీ ఫీజులు కట్టే స్థోమత లేక.. ‘యూనివర్సిటీ ఆఫ్‌ విశ్వేశ్వరయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (UVCE)’లో చేరింది కీర్తి ఎన్‌సీ. కర్ణాటకలోని మధుగిరి అనే వెనుకబడిన ప్రాంతం ఆమెది. అలాంటి పేద విద్యార్థినిని ఇటీవలే భారీ ప్యాకేజీతో కూడిన కొలువు వరించింది. ప్రస్తుతం ఈ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదువుతోన్న ఆమె.. తుది సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే క్యాలిఫోర్నియాకు చెందిన ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టింది. ఇందులో ప్రతిభ చూపిన కీర్తి.. రూ. 58.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగావకాశం అందుకుంది. ఇప్పటివరకు ఈ కాలేజీలో ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ టెక్నాలజీ సంస్థ అత్యధికంగా రూ. 49.75 లక్షల వేతనాన్ని అందించింది. ఇప్పుడు ఆ మార్క్‌ను అధిగమించి రికార్డు స్థాయి ప్యాకేజీ చేజిక్కించుకుంది కీర్తి. అయితే తనకు ఉద్యోగావకాశం అందించిన ఈ సంస్థలోనే ప్రస్తుతం ఇంటర్న్‌గా పనిచేస్తోందామె. ఈ క్రమంలోనే తన ప్రతిభను గుర్తించి ఈ ఉత్తమ అవకాశం అందించిందీ సంస్థ.

‘ఇంటర్వ్యూలో భాగంగా రైటింగ్‌, కోడింగ్‌, టెక్నికల్‌, మేనేజీరియల్‌.. వంటి దశలు పూర్తిచేశాను. ప్రతి రౌండ్లో ఆత్మవిశ్వాసంతో నా ప్రతిభను ప్రదర్శించా.. ఇక గతంలో కర్ణాటక కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 4 వేల ర్యాంకు వచ్చింది. ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో సీటొచ్చినా.. UVCEని ఎంపిక చేసుకున్నా. ఎందుకంటే ఇందులో ఫీజు తక్కువ.. విద్యార్థులకు అనువైన వాతావరణం ఉంటుంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఈ విజయం సొంతమైంది..’ అంటోన్న కీర్తి.. తన ఉద్యోగంలో భాగంగా డేటా విజువలైజేషన్‌పై పనిచేయనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్