చైనా యువత... భాగస్వాములను వెతుకుతోంది!

గత కొన్నేళ్లుగా చైనా యువత పెళ్లి చేసుకోవడానికి అయిష్టత చూపుతోందన్న సంగతి తెలిసిందే. ఇది అక్కడి ప్రభుత్వాల్లో భయాందోళనలనూ రేకెత్తిస్తోంది.

Published : 06 Jul 2024 02:13 IST

గత కొన్నేళ్లుగా చైనా యువత పెళ్లి చేసుకోవడానికి అయిష్టత చూపుతోందన్న సంగతి తెలిసిందే. ఇది అక్కడి ప్రభుత్వాల్లో భయాందోళనలనూ రేకెత్తిస్తోంది. అయితే, తాజాగా అక్కడి కుర్రకారు జీవిత భాగస్వాములను వెతికే పనిలో పడిందట. ఇంకేం సమస్య తీరిపోయినట్లే అనుకుంటున్నారా! అయితే, మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే... వాళ్లు పార్ట్‌నర్‌ను వెతుకుతోంది వాళ్లకోసం కాదు. ఎంతో ముద్దుగా పెంచుకునే వాళ్ల పెంపుడు జంతువుల కోసమట. చైనాలోని ‘పెట్‌ పేరెంట్స్‌’ వాటికోసం ప్రత్యేకించి మ్యాచ్‌మేకింగ్‌ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. పార్కుల్లో మ్యారేజ్‌ మార్కెట్ల పేరుతో జరిగే ఈ ఈవెంట్స్‌కి పెట్‌ పేరెంట్స్‌ వచ్చి తమ పెట్‌కు సరిపోయే భాగస్వామిని ఎంపికచేసుకుంటారట. అలా కుదరని వాళ్లేమో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. ‘ఇఫ్‌ యు ఆర్‌ ది వన్‌ ’ అనే పాపులర్‌ రియాలిటీ టీవీ కార్యక్రమం స్ఫూర్తితో,  ఇప్పుడు పెట్‌ పేరెంట్స్‌ కూడా ‘ఇఫ్‌ యు ఆర్‌ ది క్యూట్‌ వన్‌’ అని ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ‘మా అమ్మాయి నిని చాలా ధైర్యవంతురాలు. క్లాసికల్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టం. ఆరోగ్య స్పృహా ఎక్కువే. కారూ, ఇల్లూ ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంది.’...‘మా ఫెలైన్‌కు కొంచెం సిగ్గెక్కువ. అంతర్ముఖుడు. పైకి కొంచెం గడుసుగా కనిపిస్తాడు. ఏమీ అనుకోకండి. కానీ, పరిచయమయ్యాక మాత్రం చాలా ప్రేమగా ఉంటాడు’ అంటూ తమ పెట్స్‌ వివరాలు చెబుతున్నారు. ఇక, అలీబాబా సెకండ్‌హ్యాండ్‌ సేల్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఇయానూలో అయితే ఏటా 30లక్షల మందికి పైగా పెట్స్‌ మ్యాచ్‌కోసం వెతుకుతున్నారట. అందుకే, దీనికోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా ఒక సెక్షన్‌నూ ఏర్పాటుచేసింది. చైనానే కాదు, అనేక దేశాల్లో పిల్లులూ, కుక్కలూ... లాంటి పెంపుడు జంతువులూ, పక్షులను అచ్చం తమ కుటుంబ సభ్యులుగానే చూసుకుంటారు. రెస్టరంట్లకూ, సెలూన్లకూ, వెకేషన్లకు కూడా తీసుకెళ్తుంటారు. కొంతమందైతే వీటిని పిల్లల్లానే భావించి స్ట్రాలర్లలోనూ వాకింగ్‌కు తీసుకెళ్తుంటారు. ఏదిఏమైనా పెళ్లీ, పిల్లల్నీ వద్దనుకుంటోన్న చైనా యువత తమ పెంపుడు జంతువుల బాగోగుల గురించి మాత్రం బాగానే ఆలోచిస్తోంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్