Forbes 30 Under 30 : కొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేస్తున్నారు!

ముప్ఫై ఏళ్లంటే.. చదువు పూర్తి చేసుకొని అనుకున్న రంగంలో సెటిలయ్యే సమయం. అయితే కొంతమంది యువ ప్రతిభావనులు ముచ్చటగా ముప్ఫై కూడా నిండకుండానే తమదైన ప్రతిభతో, కొత్త ఆలోచనలతో ఆయా రంగాల్లో రాణిస్తూ తమ నైపుణ్యాల్ని చాటుతున్నారు. సొంతంగా సంస్థల్ని ప్రారంభిస్తూ వాటిని లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటా అలాంటి యువ రత్నాల్ని గుర్తించి..

Published : 09 Feb 2022 14:13 IST

(Photo: Instagram)

ముప్ఫై ఏళ్లంటే.. చదువు పూర్తి చేసుకొని అనుకున్న రంగంలో సెటిలయ్యే సమయం. అయితే కొంతమంది యువ ప్రతిభావనులు ముచ్చటగా ముప్ఫై కూడా నిండకుండానే తమదైన ప్రతిభతో, కొత్త ఆలోచనలతో ఆయా రంగాల్లో రాణిస్తూ తమ నైపుణ్యాల్ని చాటుతున్నారు. సొంతంగా సంస్థల్ని ప్రారంభిస్తూ వాటిని లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటా అలాంటి యువ రత్నాల్ని గుర్తించి.. వారి ప్రతిభకు పట్టం కడుతుంటుంది ఫోర్బ్స్‌. ఈ నేపథ్యంలోనే ‘30 అండర్‌ 30’ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో 10 మంది అమ్మాయిలు చోటు దక్కించుకోవడం విశేషం.

వ్యాపారం, వినోదం, క్రీడలు, సమాజ సేవ.. ఇలా ఒకటా, రెండా.. ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు నేటి యువత. అవకాశాలు సృష్టించుకొని మరీ అందలమెక్కుతున్నారు. తమ ప్రతిభతో ప్రపంచ గతిని మార్చుతూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజా ఫోర్బ్స్‌ జాబితాలో ఇలాంటి యువ ప్రతిభావనులే చోటు దక్కించుకున్నారు.

మానుషి అశోక్‌ జైన్‌, స్పాంజ్‌ సహ వ్యవస్థాపకురాలు

‘మన ప్రతిభ మనకు మాత్రం అన్నం పెడితే సరిపోదు.. ఈ సమాజానికీ ఎంతో కొంత ఉపయోగపడాలి..’ అంటోంది యువ ఆర్కిటెక్ట్‌ మానుషి అశోక్‌ జైన్‌. చెన్నైకి చెందిన ఆమె నగరాలు/పట్టణాలను అభివృద్ధి చేసే ముఖ్యోద్దేశంతో ‘స్పాంజ్‌’ అనే కంపెనీని స్థాపించింది. ప్రస్తుతం ఈ సంస్థకు సహవ్యవస్థాపకురాలిగా, డిజైన్‌-ఆపరేషన్స్‌ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతోన్న మానుషి.. ముంబయి, బెంగళూరుతో పాటు బోస్టన్‌, న్యూయార్క్‌, ఫ్రాన్స్‌, క్రొయేషియా.. వంటి పలు విదేశీ నగరాభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ భాగమైంది. పట్టణాల్లో గృహనిర్మాణం, పట్టణాభివృద్ధిలో భాగంగా అధిక సాంద్రత, స్థితిస్థాపకత.. అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటుంది. సుమారు దశాబ్ద కాలంగా నగరాభివృద్ధిపై కృషి చేస్తోన్న ఆమె.. అఫ్గానిస్తాన్‌కు చెందిన ససాకి ప్రాజెక్ట్‌ (కాబూల్‌ అర్బన్‌ డిజైన్‌ ఫ్రేమ్‌వర్క్‌)లో పాలుపంచుకొని తన వృత్తి నైపుణ్యాల్ని మరింత పెంచుకుంది. ఫలితంగా యుద్ధంలో దెబ్బతిన్న మరిన్ని నగరాల్ని అభివృద్ధి చేసే పలు ప్రాజెక్టుల్లో భాగమయ్యే అవకాశాల్ని సొంతం చేసుకుంది. తన డిజైనింగ్‌ నైపుణ్యాలకు గుర్తింపుగా A+D మ్యాగజీన్‌ నుంచి ‘క్రియేటివ్‌ థీసిస్‌ డిజైన్‌ మెడల్‌ అవార్డు’ను సైతం అందుకుంది మానుషి.


ఖ్యాతి ట్రెహాన్‌, గ్రాఫిక్‌ డిజైనర్

ఎన్నో భావాల్ని ఒక చిత్రంతో చెప్పచ్చన్నట్లు.. గ్రాఫిక్‌ డిజైనింగ్‌, విజువల్‌ ఆర్ట్‌తో ఆ భావాలకు ప్రాణం పోయచ్చని నిరూపిస్తోంది దిల్లీకి చెందిన గ్రాఫిక్‌ డిజైనర్‌ ఖ్యాతి ట్రెహాన్‌. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఆమె.. చదువుకునే సమయంలోనే ఈ సృజనాత్మక దృశ్య ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని కలలు కంది. వాటిని సాకారం చేసుకునే దిశగా, తనలోని నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు.. IDEO, స్నాప్‌చాట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, శ్యామ్‌సంగ్‌, అడోబ్‌, యాపిల్‌.. వంటి దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసింది. ప్రకృతిలోని అందాల్ని 3డి డిజిటల్‌ ఇలస్ట్రేషన్స్‌గా రూపొందించి.. ఆయా బొమ్మలతో ఎంతోమందికి మానసిక చికిత్స (ఎకో థెరపీ) చేస్తోంది. అలాగే 3డి ఆర్ట్‌ వర్క్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్తోనూ వివిధ రకాల భావాలకు చిత్ర రూపమిస్తోంది. ఇలా తాను రూపొందించిన ఇలస్ట్రేషన్స్‌ WIRED వంటి పలు ప్రముఖ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ఈ యువ డిజైనర్‌కు పలు అవార్డులు-రివార్డుల్నీ తెచ్చిపెట్టాయి.


తషీన్‌ రహీమ్‌తూలా, టేస్ట్‌ రీట్రీట్‌ వ్యవస్థాపకురాలు

ఉన్నది ఒక్కటే జిందగీ.. ఈ క్రమంలో మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి సందర్భం ప్రత్యేకమైనదే.. అందుకే ఏ అకేషన్‌నీ వదులుకోకుండా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలంటోంది పాతికేళ్ల ముంబయి చిన్నది తషీన్‌ రహీమ్‌తూలా. అయితే అందుకోసం మనం ఎంచుకునే పార్టీ ఎంత విలాసవంతంగా ఉంటుందో.. అతిథులకిచ్చే ట్రీట్‌ కూడా అంతే ఆరోగ్యకరంగా, విభిన్న దేశాల రుచుల మేళవింపుగా ఉండాలంటోందామె. ఇలాంటి లగ్జరీ ట్రీట్‌ని ఔత్సాహికులకు పరిచయం చేసే ఉద్దేశంతోనే ‘టేస్ట్‌ రీట్రీట్‌’ అనే సంస్థను స్థాపించింది. అది పెళ్లైనా, ఇతర కార్పొరేట్‌ ఈవెంట్‌ అయినా, థీమ్‌డ్‌ పార్టీ, కార్పొరేట్‌ గిఫ్టింగ్‌, డిన్నర్‌.. వంటివైనా సరే.. ఆర్డర్‌ వచ్చిందంటే చాలు.. విభిన్న నోరూరించే వంటకాలతో అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చేయడానికి తానెప్పుడూ రడీగా ఉంటానంటోందీ ఫుడ్‌ లవర్.

పర్షియన్‌ హాట్‌ చాక్లెట్‌, ఫ్రెంచ్‌ టోస్ట్స్‌, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మఫిన్స్‌, న్యూయార్క్‌ స్పెషల్‌ చాక్లెట్‌ కేక్‌, రుచికరమైన స్మూతీస్‌.. ఇలా ఒకటేమిటి.. తన టేస్ట్‌ రీట్రీట్‌ మెనూ చూస్తేనే కడుపు నిండిపోతుందనుకోండి! అంతేకాదండోయ్‌.. ఆ వంటకాల్ని అంతే ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసి పార్శిల్‌ చేయడం, వడ్డించడంలోనూ తనకు సాటి మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. అందుకే సామాన్యులతో పాటు సెలబ్రిటీలూ ఆమె రుచుల్ని ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం దుబాయ్‌, లండన్‌ వంటి మహానగరాలకూ తన సేవల్ని విస్తరించింది తషీన్‌.


క్రిష్మా షా, CLINIBIZ సహవ్యవస్థాపకురాలు

బయోటెక్నాలజీపై తనకున్న మక్కువతో CLINIBIZ అనే అధ్యయన సంస్థను స్థాపించింది 28 ఏళ్ల క్రిష్మా షా. వివిధ పరిశోధన సంస్థలు నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న లోపాల్ని అధిగమించడమే ముఖ్యోద్దేశంగా ఏర్పాటైందీ సంస్థ. క్లినికల్‌ ట్రయల్స్ను మరింత సమర్ధంగా, వేగంగా నిర్వహించడంలో ఆమెకు ఐదేళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాదు.. వివిధ పరిశోధన, పరికరాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ఆమె.. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌, వాటి కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తోంది.


నిమిషా సజాయన్‌, నటి

తమ పనితీరుతోనే తామేంటో నిరూపించుకుంటారు కొందరమ్మాయిలు. మలయాళ నటి నిమిషా సజాయన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సినిమా అవకాశాల కోసం ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు చాలామంది. కానీ తనకు అందివచ్చిన అవకాశాలతో, తనలోని నటప్రతిభతో ఐదేళ్ల కాలంలోనే అద్భుత నటిగా ఎదిగిందామె. రాజీవ్‌ రవి, మహేశ్‌ నారాయణన్‌, మధుపాల్‌.. వంటి మేటి దర్శకులతో కలిసి పనిచేసింది. 2017లో దిలీష్‌ పోతన్‌ తెరకెక్కించిన Thondimuthalum Driksakshiyum అనే చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె.. తొలి చిత్రానికే ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారం అందుకుంది. ఇక గతేడాది నాలుగు సినిమాలు ఆమెకు వరుస హిట్లను సాధించి పెట్టాయి. ‘సినిమా అనేది ఒక కళ. దీని ద్వారా రాజకీయ, సామాజిక సమస్యల్ని ఎత్తి చూపగలిగితే దాని విలువ మరింత పెరుగుతుంది..’ అంటోందీ యువ కథానాయిక.

వీళ్లతో పాటు హాకీ క్రీడాకారిణి వందనా కటారియా (క్రీడలు), వాట్సప్‌ పేమెంట్స్‌ ప్రొడక్ట్‌ లీడ్‌ రియా మిర్చందాని (ఆర్థిక రంగం), ట్రాన్స్‌జెండర్‌ డాక్టర్‌ త్రినేత్ర హల్దార్‌ గుమ్మరాజు (డాక్టర్ / డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్), Animall CEO-COO నీతూ యాదవ్‌-కీర్తి జాంగ్రా (అగ్రిటెక్‌ రంగం).. వంటి యువ ప్రతిభావనులు ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్