Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!

పుట్టుకతోనే శారీరక, మానసిక లోపాలున్న వారు ఈ సమాజంలో ఎదుర్కొనే సమస్యలెన్నో. వారికేమీ చేతకాదని కొందరు చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటి అవమానాలకు కొంతమంది కుంగిపోతుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ లోపాలను....

Updated : 05 Jul 2022 18:59 IST

(Photos: Instagram)

పుట్టుకతోనే శారీరక, మానసిక లోపాలున్న వారు ఈ సమాజంలో ఎదుర్కొనే సమస్యలెన్నో. వారికేమీ చేతకాదని కొందరు చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటి అవమానాలకు కొంతమంది కుంగిపోతుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ లోపాలను అధిగమించి విజయాలు సాధిస్తుంటారు. ముంబయికి చెందిన ఇరవయ్యేళ్ల జైనికా జగసియా ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ సమస్యతో జన్మించిన ఆమె తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక వైపు మోడలింగ్‌ చేస్తూ మరోవైపు బేకింగ్‌లో రాణిస్తోంది. ఈ క్రమంలో తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

మంచి జీవితం అందించాలని...

ముంబయికి చెందిన జైనికకు పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ సమస్య వచ్చింది. ఈ సమస్య ఉన్నవారిలో ఎదుగుదలలో లోపాలు వస్తుంటాయి. దీనివల్ల చాలామంది ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ, జైనిక తల్లిదండ్రులు అలా కాకూడదని భావించారు. ఈ సమస్యను దూరం చేయడానికి ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ.. ఇలా వీలైన ప్రతి మార్గాన్ని అనుసరించారు.

‘గర్భంతో ఉన్నప్పుడే నాకు ఏదో సమస్య ఉందనిపించింది. ఆ సమయంలో మా పాప నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సిజేరియన్‌ చేశాక నేను కోమాలోకి వెళ్లాను. తర్వాత పాపకు డౌన్‌ సిండ్రోమ్‌ ఉందని చెప్పారు. హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చాక ఆ బాధతో రాత్రంతా ఏడ్చాను. అప్పుడు నా భర్త ఒక్కటే చెప్పారు. మనం బాధపడకుండా పాపకు సాధ్యమైనంత వరకు మంచి జీవితాన్ని అందించాలన్నారు’ అని జైనిక తల్లి చెప్పుకొచ్చింది.

తల్లిదండ్రుల సలహాతో...

ఈ క్రమంలో జైనిక తల్లిదండ్రులు వివిధ రకాల చికిత్సలను ప్రయత్నించారు.  వీటి నిమిత్తం ప్రతి రోజూ 8 నుంచి 10 గంటల సమయం తన కోసం కేటాయించేవారు. కొన్ని సంవత్సరాలకి వారు పడిన కష్టం ఫలించింది. జైనికలో క్రమంగా మార్పు వచ్చింది. చదువులో కూడా చక్కటి ప్రతిభను కనపరిచి పదవ తరగతి పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించింది. ఆ తర్వాత కరోనా సమయంలో జైనిక స్కూల్లో కూడా ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టారు. అయితే జైనిక ఎదుగుదలకు ఆన్‌లైన్ క్లాసులు అంతగా ఉపయోగపడవనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అందుకే ఆ సమయంలో తనకు కొత్త నైపుణ్యాలను నేర్పించాలనుకున్నారు. జైనిక సోదరి గీతిక అప్పటికే ఒక హోం బేకరీ నడుపుతోంది. దాంతో గీతికతో కలిసి బేకింగ్‌ నేర్చుకోమని సలహా ఇచ్చారు.

బేకింగ్ నైపుణ్యంతో..

అయితే జైనికకు మొదట్లో బేకింగ్‌ చేయడం ఇష్టం ఉండేది కాదట. బేకింగ్‌ చేసేటప్పుడు ఆ పదార్థాలు చేతికి అంటుకోవడమే అందుకు కారణం. కానీ, తల్లిదండ్రులు చెప్పటంతో తన సోదరితో కలిసి బేకింగ్‌ చేయడం ప్రారంభించింది. కొన్ని రోజులకే ఇష్టం లేదన్న బేకింగ్‌పై మక్కువ పెంచుకొని కొత్త రకాల రెసిపీలను తయారు చేయడం మొదలు పెట్టింది. ఆమెకు చాక్లెట్‌ కుకీస్‌ చేయడమంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలో- తన బేకింగ్‌ నైపుణ్యాలతో జైనిక సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది.

మోడలింగ్‌పై మక్కువ..

జైనికకు చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. అయితే బేకింగ్‌లో పడి తన మోడలింగ్‌ని పక్కన పెట్టేసింది. బేకింగ్‌పై పట్టు సాధించాక మోడలింగ్‌పై తనకున్న ఆలోచనను తన తల్లిదండ్రులతో పంచుకుంది. వారు కూడా అంగీకరించి గత సంవత్సరం ఒక ఫొటోషూట్‌ ఏర్పాటు చేశారు. ఆ ఫొటోషూట్‌ తనకు ఎంతో మరపురాని ఆనందాన్నిచ్చిందని చెబుతోంది జైనిక.

 ‘ఫొటోషూట్లో భాగంగా మొదటి ఫొటోకి స్టిల్‌ పెట్టడం నాకు ఇప్పటికీ గుర్తుంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ ఫొటోషూట్‌కి సంబంధించిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. షూట్‌ అయిపోయిందన్న విషయం తెలియనంతగా అందులో లీనమయ్యాను. ఆ తర్వాత ఫొటోలు ఎలా వస్తాయోనని కంగారుపడ్డా. కానీ, ఫొటోలు చూసిన తర్వాత నా ఆనందానికి అవధుల్లేవు. ఆ ఫొటోషూట్‌ నాకు మరింత ధైర్యానిచ్చింది’ అని చెప్పుకొచ్చింది. అలా జైనిక ఒకవైపు బేకింగ్‌ చేస్తూ మరోవైపు పార్ట్‌టైమ్‌ మోడలింగ్‌ చేస్తోంది.

‘ఈ రోజు నా మొహంలో చిరునవ్వు ఉందంటే దానికి కారణం నా కుటుంబం ఇచ్చిన సహకారమే. మా అమ్మానాన్న చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడారు. ఇక నా సోదరి గీతికతో పని చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకున్నా. దానివల్లనే బరువు కూడా తగ్గాను’ అని చెప్పుకొచ్చింది జైనిక.

ప్రస్తుతం బేకింగ్‌లో రాణిస్తోన్న గీతక తన లక్ష్యం మాత్రం పూర్తి స్థాయిలో మోడల్‌గా రాణించడమే అని చెబుతోంది. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది.. అలాగే ప్రతిఒక్కరిలోనూ తమను తాము నిరూపించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఉంటాయి.. వాటికి సాన బట్టి మీ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల వచ్చే ఆనందం వెలకట్టలేనిది’ అంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని