జింక్ కావాలంటే ఈ పదార్థాలు తీసుకోవాల్సిందే
close
Published : 21/01/2022 19:16 IST

జింక్ కావాలంటే ఈ పదార్థాలు తీసుకోవాల్సిందే!

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి బాగా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే కొన్ని పోషకాలు సరిగా శరీరానికి అందకపోవడంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘జింక్’.

‘జింక్‌’తో రక్షణ పొందుదాం!

యాంటీ బాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్‌, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి గాయాలను త్వరగా నయం చేసే శక్తి ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం, శిరోజాల సంరక్షణలోనూ కీలక పాత్ర వహిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న జింక్‌ను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఉపయోగించే కొన్ని ఔషధాలతో పాటు జింక్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. అయితే అతిగా వాడితే ఏదైనా అనర్థమే. కాబట్టి తగిన మోతాదులో మాత్రమే జింక్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా సప్లిమెంట్లు కాకుండా, వివిధ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అని గమనించాలి.

వీటిలో అధికం!

చికెన్, రెడ్‌మీట్‌, బీఫ్‌, షెల్‌ఫిష్‌, సాల్మన్‌ చేపలు, గుడ్లు... ఇలా మాంసాహారానికి సంబంధించిన పదార్థాల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి సరిపడా జింక్‌ను పుష్కలంగా పొందవచ్చు. శాకాహారులైతే కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలో జింక్ స్థాయులను పెంచుకోవచ్చు. అవేంటంటే..!

నట్స్

మనం ఎక్కువగా స్నాక్స్‌గా తినే బాదం, వాల్‌నట్స్‌, వేరుశెనగ, జీడిపప్పుల్లో జింక్‌ లభ్యత ఎక్కువగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి అందించే ఫైబర్‌, విటమిన్లు కూడా వీటిలో ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు నట్స్‌ను డైలీ మెనూలో చేర్చుకుంటే ఉత్తమం.

సెనగలు

శరీరంలో జింక్‌ పరిమాణాన్ని పెంచుకోవాలంటే సెనగలు తప్పక తీసుకోవాల్సిందే. పైగా వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పాటు చిక్కుళ్లు, బీన్స్‌లలో కూడా జింక్‌ అధికంగా ఉంటుంది.

గుమ్మడి/పుచ్చకాయ గింజలు

పుచ్చకాయ శరీరంలో నీటి స్థాయులు పెంచితే, అందులోని గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో జింక్‌తో పాటు పొటాషియం, కాపర్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్‌ అధికంగానే ఉంటుంది. కాబట్టి వాటిని రోజూ స్నాక్స్‌లా తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే సలాడ్స్‌లో కలిపి తీసుకున్నా బాగుంటుంది.

బెర్రీస్

స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ లాంటి జాతికి చెందిన పండ్లను తీసుకుంటే జింక్‌ లోపాన్ని అధిగమించవచ్చు. ఈ పండ్లలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

తాజా కూరగాయలు

వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో జింక్‌ లభ్యత కూడా ఒకటి. బచ్చలి కూర, పుట్టగొడుగులు, బ్రకలి, వెల్లుల్లి వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జింక్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

దుంపలు

ఇతర వెజిటబుల్స్‌తో పోల్చితే బంగాళా దుంపలు, చిలగడ దుంపల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. పైగా వీటిలో ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌-సి, బి 6 తదితర పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.

పాలు / పాల ఉత్పత్తులు

పాలు, వెన్న, పెరుగు లాంటి డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అందుకు ప్రధాన కారణం వీటిలో ఉండే క్యాల్షియం లభ్యత. అయితే వీటిని డైట్‌లో చేర్చుకుంటే జింక్‌ కూడా శరీరానికి పుష్కలంగా అందుతుంది.

వీటిలో కూడా..

అలాగే గోధుమ, క్వినోవా, ఓట్స్ మొదలైన వాటిలో కూడా జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జింక్‌తో పాటు ఫైబర్‌, విటమిన్‌-బి, ఐరన్‌, మెగ్నీషియం లాంటి పోషకాలను కూడా పొందవచ్చు.

అదేవిధంగా- నువ్వులు, పనీర్‌, డార్క్‌ చాక్లెట్‌, కొన్ని రకాల పప్పు ధాన్యాల నుంచి కూడా జింక్ లభిస్తుంది. మరి వీటన్నింటినీ రోజూ ఆహారంలో భాగం చేసుకోండి. శరీరంలో జింక్‌ స్థాయులను పెంచుకోండి. కరోనా లాంటి మహమ్మారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

గమనిక:

జింక్ ఎక్కువగా లభించాలని ఇష్టం వచ్చినట్లుగా వివిధ రకాల సప్లిమెంట్లను మాత్రం వాడకండి. ఎందుకంటే- ప్రస్తుత పరిస్థితుల్లో జింక్ ఎక్కువైనా అనర్ధమే అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటి పైనే ఆధారపడడం మంచిది. ఒకవేళ సప్లిమెంట్లు వాడక తప్పని పరిస్థితుల్లో మాత్రం సంబంధిత వైద్యుల సలహాతోనే వాటిని తగిన మోతాదులో వాడడం అన్ని విధాలా శ్రేయస్కరం.


Advertisement

మరిన్ని