Published : 07/02/2023 20:57 IST

జింక్.. తగినంత అందాలంటే..!

యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్.. తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి గాయాలను త్వరగా నయం చేసే శక్తి ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మం, శిరోజాల సంరక్షణలోనూ కీలక పాత్ర వహిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న జింక్ లభించే వివిధ ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

చికెన్, రెడ్‌మీట్‌, బీఫ్‌, షెల్‌ఫిష్‌, సాల్మన్‌ చేపలు, గుడ్లు... మొదలైన వాటిలో జింక్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి సరిపడా జింక్‌ను పుష్కలంగా పొందవచ్చు. శాకాహారులైతే కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలో జింక్ స్థాయులను పెంచుకోవచ్చు.

నట్స్

బాదం, వాల్‌నట్స్‌, వేరుశెనగ, జీడిపప్పుల్లో జింక్‌ లభ్యత ఎక్కువగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి అందించే ఫైబర్‌, విటమిన్లు కూడా వీటిలో ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు నట్స్‌ను డైలీ మెనూలో చేర్చుకుంటే ఉత్తమం.

సెనగలు

శరీరంలో జింక్‌ పరిమాణాన్ని పెంచుకోవాలంటే సెనగలు తప్పక తీసుకోవాల్సిందే. పైగా వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పాటు చిక్కుళ్లు, బీన్స్‌లలో కూడా జింక్‌ అధికంగా ఉంటుంది.

గుమ్మడి/పుచ్చకాయ గింజలు

పుచ్చకాయ శరీరంలో నీటి స్థాయులు పెంచితే, అందులోని గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో జింక్‌తో పాటు పొటాషియం, కాపర్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్‌ అధికంగానే ఉంటుంది. కాబట్టి వాటిని రోజూ స్నాక్స్‌లా తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే సలాడ్స్‌లో కలిపి తీసుకున్నా బాగుంటుంది.

బెర్రీస్

స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ లాంటి జాతికి చెందిన పండ్లను తీసుకుంటే జింక్‌ లోపాన్ని అధిగమించవచ్చు. ఈ పండ్లలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

తాజా కూరగాయలు

వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో జింక్ లభ్యత కూడా ఒకటి. బచ్చలి కూర, పుట్టగొడుగులు, బ్రకలి, వెల్లుల్లి వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జింక్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

దుంపలు

ఇతర కూరగాయలతో పోల్చితే బంగాళా దుంపలు, చిలగడ దుంపల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. పైగా వీటిలో ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌-సి, బి 6 తదితర పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.

పాలు / పాల ఉత్పత్తులు

పాలు, వెన్న, పెరుగు లాంటి డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిని డైట్‌లో చేర్చుకుంటే క్యాల్షియంతో పాటు జింక్‌ కూడా శరీరానికి పుష్కలంగా అందుతుంది.

వీటిలో కూడా..

అలాగే గోధుమ, క్వినోవా, ఓట్స్ మొదలైన వాటిలో కూడా జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జింక్‌తో పాటు ఫైబర్‌, విటమిన్‌-బి, ఐరన్‌, మెగ్నీషియం లాంటి పోషకాలను కూడా పొందవచ్చు.

అదేవిధంగా- నువ్వులు, పనీర్‌, డార్క్‌ చాక్లెట్‌, కొన్ని రకాల పప్పు ధాన్యాల నుంచి కూడా జింక్ లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని