Sri lanka Athletes: కామన్వెల్త్‌ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!

బ్రిటన్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక బృందంలోని 10 మంది సభ్యులు అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యారు. బహుశా ఉపాధి కోసం వారు బ్రిటన్‌లోనే...

Published : 08 Aug 2022 02:25 IST

కొలంబో: బ్రిటన్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక బృందంలోని 10 మంది సభ్యులు అనుమానాస్పదస్థితిలో అదృశ్యమయ్యారు. బహుశా ఉపాధి కోసం వారు బ్రిటన్‌లోనే ఉండిపోయేందుకు ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిది మంది అథ్లెట్లు, ఒక మేనేజర్‌ అదృశ్యమైనట్లు శ్రీలంకకు చెందిన ఓ క్రీడా అధికారి ఆదివారం వెల్లడించారు. వారిలో ముగ్గురు గత వారమే అదృశ్యమయ్యారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి మరో ఏడుగురు కనిపించకుండా పోయారని తెలిపారు. మొత్తం 160 మంది సభ్యులతో కూడిన శ్రీలంక బృందం బ్రిటన్‌కు వెళ్లింది.

అదృశ్యమైన మొదటి ముగ్గురిని బ్రిటన్‌ పోలీసులు గుర్తించారు. అయితే వారు స్థానిక చట్టాలను ఉల్లంఘించనందున, పైగా ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉన్నందున.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని శ్రీలంక అధికారి తెలిపారు. అయితే, వారి ఆచూకీ మాత్రం వెల్లడించలేదన్నారు. గతంలోనూ ఆయా అంతర్జాతీయ క్రీడాపోటీల నుంచి శ్రీలంక క్రీడాకారులు మాయమైన ఘటనలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబరులో నార్వేలోని ఓస్లోలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ సందర్భంగా శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును వదిలిపెట్టి అదృశ్యమయ్యారు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా.. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని