
UAE Attack: హౌతీలపై సౌదీ సంకీర్ణ దళాల వైమానిక దాడులు.. 11 మంది మృతి!
సనా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుధాబిపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమెన్ రాజధాని సనాపై మంగళవారం వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందినట్లు సమాచారం. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమిలో యూఏఈ కూడా భాగస్వామి.
‘వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని స్థానికులు తెలిపినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. మృతుల సంఖ్యను వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. అబుధాబిపై తామే డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడినట్లు హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు గతంలోనూ సౌదీ అరేబియా సరిహద్దుల్లో పదేపదే దాడులకు పాల్పడ్డారు. అయితే సరిహద్దులు దాటి దాడిచేయడం (యూఏఈ ఘటన) ఇదే మొదటి సారి! అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి.