Mummy mystery: 128 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పుడు అంత్యక్రియలు!

అమెరికాలోని (America) చిన్న నగరం రీడింగ్‌లో ‘స్టోన్‌మ్యాన్‌ విల్లీ’గా పిలిచే మమ్మీ (Mummy) ఉంది. ఈ శనివారం దానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

Updated : 03 Oct 2023 19:08 IST

Image: WorldBufferZone

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుమారు 128 ఏళ్ల క్రితం అమెరికాలోని పెన్సిల్వేనియా జైలులో ఓ దొంగ కిడ్నీ వైఫల్యంతో చనిపోయాడు. ఇప్పుడు అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విచిత్రంగా ఉంది కదూ! అయితే, అనుకోకుండా ‘మమ్మీ’గా (Mummy) మార్చిన మృతదేహం కథ మీరు తెలుసుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని (America) చిన్న నగరం రీడింగ్‌లో ‘స్టోన్‌మ్యాన్‌ విల్లీ’గా పిలిచే మమ్మీ ఉంది. దాన్ని ఓమన్స్‌ ఫ్యూనరల్‌ హోమ్‌లో భద్రపరిచారు. మమ్మీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది కదా..! అందుకే అక్కడికి పర్యాటకులు, స్థానికులు అత్యధిక సంఖ్యలో తరలివెళ్తుంటారు.

లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!

 మమ్మీ రూపంలో ఉన్న వ్యక్తి 1895 నవంబర్‌ 19న చనిపోయాడు. దొంగతనం కేసులో జైల్లోకి వచ్చిన అతడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు జైలు అధికారులు ప్రయత్నించగా వారికి ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. విచారణలో అతడు నకిలీ పేరు చెప్పినట్లు తెలిసి విస్తుబోయారు. పోలీసులు మృతుడి కుటుంబీకుల కోసం వెతుకుతున్న సమయంలోనే మృతదేహం ఫ్యూనరల్ హోమ్‌కు చేరింది. ఎక్కువ రోజులు అక్కడే ఉంటే మృతదేహం కుళ్లిపోతుందనే ఉద్దేశంతో తమకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో దాన్ని అప్పటికప్పుడు మమ్మీగా మార్చేశారు. ఎంత వెతికినా మృతుడి కుటుంబీకుల వివరాలు తెలియకపోవడంతో దాన్ని మమ్మీగానే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఫ్యూనరల్‌ హోమ్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తాము చేసిన ప్రయోగం ఎంత మేరకు విజయవంతం అయిందో తెలుసుకోవడానికి ఆ విజ్ఞప్తి చేసింది. 

ప్రస్తుతం అందరికీ కన్పిస్తున్న మమ్మీ ఓ సూట్‌, టై ధరించి ఉంది. దాని వెంట్రుకలు, దంతాలు చెక్కు చెదర్లేదు. శరీరం మాత్రం ఎండబెట్టిన జంతు చర్మంలా తయారైంది. మమ్మీ ప్రయోగం జరిగి వందేళ్లు గడిచిపోయిన తరువాత స్టోన్‌మ్యాన్‌ విల్లీ అసలు ఎవరు అనే విషయాన్ని ఫ్యూనరల్ హోమ్ కనుగొంది. కొన్ని పురాతన దస్త్రాలు, అత్యాధునిక సాంకేతికత సాయంతో అతడి వివరాలను రాబట్టింది. మృతుడికి ఐరిష్‌ మూలాలున్నట్లు సమాచారం. దాంతో ఈ శనివారం (అక్టోబరు 7) రీడింగ్‌ వీధుల గుండా మమ్మీ అంతిమయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత్యక్రియలు పూర్తయిన తరువాత కట్టే సమాధిపై మమ్మీగా మారిన మృతుడి అసలు వివరాలను ముద్రిస్తామని ఫ్యూనరల్‌ హోమ్‌ చెబుతున్నట్లు కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని