America: టెక్సాస్‌లోని పాఠశాలలో దుండగుడి కాల్పులు.. 21 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో పాటు మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు.

Updated : 25 May 2022 18:09 IST

టెక్సాస్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో పాటు మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ వెల్లడించారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయినట్లు  అక్కడి మీడియా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని తమ కస్టడీలోకి తీసుకున్నాయి.

దుండగుడు తుపాకీతో రోబ్‌ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడని, తన వద్ద రైఫిల్‌ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్‌ అబాట్‌ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులు సమాచారాన్ని అధ్యక్షుడు జోబైడెన్‌కు అధికారులు అందజేశారు. 

2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్‌ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతిచెందారు. ఆ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన.  ఈ ఘటనతో అమెరికాలో మరోసారి గన్‌ కల్చర్‌పై  ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని