Guinness World Record: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసి... రికార్డు కొట్టేసింది!

చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించాలన్నది జరా రూథర్‌ ఫర్డ్‌ కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది.

Updated : 21 Jan 2022 03:55 IST

కోర్త్రిజిక్‌ (బెల్జియం): దేశంలో ఓ మూల నుంచి మరో మూలకు వెళితే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం మనలో చాలా మందికి కష్టం.. అలాంటిది భిన్న వాతావరణ పరిస్థితులను దాటిందా అమ్మాయి! బస్సులోనో, రైళ్లోనో ఒంటరిగా ప్రయాణించాలంటే మనలో చాలా మంది భయపడుతుంటారు.. కానీ, విమానంలో వేల కిలోమీటర్లు ప్రయాణించిందా అమ్మాయి! నాలుగు రోజులు తల్లిదండ్రులను వదిలి వెళ్లాలంటే బెంగ పెట్టుకుంటారు కొందరు.. కానీ ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది ఆ అమ్మాయి! అదీ ఒంటరిగా.. ఓ బుల్లి విమానంలో!! అందుకే గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ఆమెకు దాసోహమయ్యింది. ఆమే బెల్జియంకు చెందిన జరా రూథర్‌ ఫర్డ్‌. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా తాజాగా గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది.

చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించాలన్నది జరా రూథర్‌ ఫర్డ్‌ కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయల్దేరింది. వాస్తవానికి మూడు నెలల్లోనే ఈ ప్రయాణం పూర్తి కావాలి. కానీ ఐదు నెలల సమయం పట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల రెండు నెలల ఆలస్యంగా 155 రోజుల తర్వాత స్వదేశంలోకి అడుగు పెట్టింది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులకు ముద్దాడి తన సంతోషం వ్యక్తంచేసింది.

ఈ ప్రయాణంలో ఐదు ఖండాల్లోని 41 దేశాలను సందర్శించింది జరా. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను చూశానని చెప్పుకొచ్చింది. మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతల వరకు తన ప్రయాణం కొనసాగిందని చెప్పారు. ఒక్కోసారి భయం వేసేదని, అయినా ఈ సాహసం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులు, బాలికలు కూడా తనలా ఏవియేషన్‌ రంగంవైపు అడుగులు వేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈమె కంటే ముందు అమెరికాకు చెందిన 30 ఏళ్ల షయెస్తా వాయిజ్‌ 2017లో ప్రపంచాన్ని చుట్టొచ్చి రికార్డు నెలకొల్పారు. ఇప్పుడా రికార్డును జరా రూథర్‌ఫర్డ్‌ అధిగమించింది. 18 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టొచ్చిన వ్యక్తిగా ట్రావిస్‌ లుడ్లో అనే యువకుడి పేరిట ఆ రికార్డు ఇంకా సజీవంగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని