Mercedes Benz:రూ.1100 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు!

ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ సరికొత్త రికార్డు సృష్టించింది​. 67 ఏళ్ల కారును రూ.వందల కోట్లకు విక్రయించింది........

Published : 21 May 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ సరికొత్త రికార్డు సృష్టించింది​. 67 ఏళ్ల కారును వందల కోట్లకు విక్రయించింది. 1955లో రూపొందించిన ఓ కారును ఏకంగా 135 మిలియన్‌ యూరోలకు విక్రయించింది. 1955 నాటి మెర్సిడెస్ బెంజ్​ ఎస్​ఎల్ఆర్​ కూపే మోడల్‌ వేలంపాటలో 142 మిలియన్ డాలర్లకు (దాదాపు 1100 కోట్లు) అమ్ముడుపోయినట్లు తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇదేనని సంస్థ వెల్లడించింది. కార్ల చరిత్రలోనే మరే ఇతర కారుకు ఇంత ధర పలికిన దాఖలాలు లేవు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్లోబల్ స్కాలర్​షిప్ ఫండ్ కోసం ఉపయోగిస్తామని మెర్సిడెస్ తెలిపింది.

1963లో తయారైన ఫెరారీ 250 జీటీఓ కారుకు 2018లో జరిగిన వేలంపాటలో 70మిలియన్​ డాలర్లు దక్కాయి. ఆ తర్వాత ఈ మెర్సిడెస్ కారుకే భారీ ధర పలికింది. ఫెరారీ కారుతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. 67 ఏళ్ల తర్వాత మెర్సిడెస్ బెంజ్​ ఎస్​ఎల్ఆర్​ కూపే మోడల్​లో ప్రస్తుతం రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. మరో వాహనం జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెజ్‌-బెంజ్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి చీఫ్​ ఇంజినీర్​ పేరును ఈ కార్లకు పెట్టారు. ఇవి గంటకు 186 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 300 హార్స్​పవర్​తో 8 సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. కారు డోర్లు పైకి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా డ్రైవర్​కు రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత.

మే 5న స్టట్​గర్ట్​లో మెర్సిడెస్ బెంజ్​ మ్యూజియంలో ప్రైవేటుగా అతికొద్ది మంది సమక్షంలో ఈ వేలంపాటను నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారును ఎవరు దక్కించుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వేలంపాటలో పాల్గొన్న కార్ డీలర్​ బ్రయాన్ రాబోల్డ్ తన క్లయింట్ కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని