Ukraine Crisis: 500కేజీల బాంబుతో నివాస భవనంపై దాడి.. 18మంది పౌరుల మృతి

సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది......

Published : 08 Mar 2022 17:21 IST

మృతుల్లో ఇద్దరు చిన్నారులు

కీవ్‌: ఉక్రెయిన్​పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తోంది. ఓ వైపు కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. అందుకు విరుద్ధంగా నివాస గృహాలే లక్ష్యంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. ‘మానవత్వాన్ని మంటగలుపుతూ గత రాత్రి రష్యన్ పైలట్లు సుమీలో మరో నేరానికి పాల్పడ్డారు. నివాస భవనాలపై 500 కిలోల బాంబులు వేశారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా 18 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అంటూ  ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేసింది.

చెర్నివిహ్‌లోని ఓ భవనంపై రష్యా సేనలు ఇదే తరహా దాడికి పాల్పడగా.. అదృష్టవశాత్తూ ఆ బాంబు పేలలేదు. కాగా ఆ బాంబు ఫొటోను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘అత్యంత ప్రమాదకరమైన 500కేజీల బాంబును చెర్నివిహ్‌లోని ఓ నివాస భవనంపైకి ప్రయోగించారు. కానీ అది పేలలేదు. రష్యా ఇలాంటి అనేక దాడులను చేస్తూ అమాయక ప్రజలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటోంది’ అంటూ ఆవేదన చెందారు. రష్యన్ అనాగరికుల నుంచి ప్రజలను రక్షించడంలో మాకు సహాయపడాలని, గగనతలాన్ని మూసివేయాలని ఆయన వేడుకున్నారు. యుద్ధ విమానాలను అందించాలని కోరారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని