Russia: రష్యాలో ప్రార్థనాస్థలాలపై దాడుల్లో 20 మంది మృత్యువాత

రష్యాలోని దగెస్థాన్‌ ప్రాంతంలో సాయుధ దుండగులు ఆదివారం జరిపిన దాడులు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడి రెండు నగరాల్లో దాదాపుగా ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది పోలీసులే కావడం గమనార్హం.

Published : 25 Jun 2024 05:27 IST

వారిలో 15 మంది పోలీసులే 

మాస్కో: రష్యాలోని దగెస్థాన్‌ ప్రాంతంలో సాయుధ దుండగులు ఆదివారం జరిపిన దాడులు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడి రెండు నగరాల్లో దాదాపుగా ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది పోలీసులే కావడం గమనార్హం. దగెస్థాన్‌ రాజధాని మహచ్‌కలాలోని ఓ చర్చి, ట్రాఫిక్‌ పోలీసు పోస్ట్‌పై; దర్బాంట్‌ నగరంలోని మరో చర్చి, యూదుల ప్రార్థనాస్థలంపై ఈ దాడులు జరిగాయి. దగెస్థాన్‌ ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం. తాజా ఘాతుకాలు ఇస్లామిక్‌ ఉగ్రవాదుల దుశ్చర్యలే అయ్యుంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్పుల్లో చాలామంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనలపై జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. తాజా దాడులకు సంబంధించి ఐదుగురు సాయుధులను మట్టుబెట్టినట్లు కమిటీ తెలిపింది. 


మీపై ప్రతిచర్యలు తప్పవు అమెరికాకు రష్యా హెచ్చరిక 

మాస్కో: క్రిమియాలోని సెవాస్టొపొల్‌ నగరంపై ఉక్రెయిన్‌ ఆదివారం జరిపిన దాడిలో అమెరికా తయారీ క్షిపణులను ఉపయోగించినట్లు నిర్ధారణ కావడంతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని అమెరికా రాయబారి లినే ట్రాసీకి సోమవారం సమన్లు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు క్షిపణులను సరఫరా చేయడం ద్వారా యుద్ధంలో ఆ దేశం తరఫున క్రియాశీల పక్షంగా వాషింగ్టన్‌ అవతరించిందంటూ మండిపడింది. అందుకు తాము తప్పకుండా ప్రతిచర్యలు చేపడతామని హెచ్చరించింది. కీవ్‌కు అత్యాధునిక ఆయుధాలు అందజేసింది వాషింగ్టనే కాబట్టి సెవాస్టొపొల్‌లో దాడికి అది కూడా సమాన బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని