Ukraine Crisis: మేరియుపోల్‌లో భవన శిథిలాల కింద 200 మృతదేహాలు!

రష్యా సేనలు ముప్పేట జరిపిన దాడులతో ఉక్రెయిన్‌లో అందమైన పోర్టు సిటీగా పేర్గాంచిన మేరియుపోల్‌ శ్మశానంలా మారింది. అక్కడ తవ్వేకొద్దీ శవాల గుట్టలు ......

Published : 24 May 2022 18:48 IST

(రష్యా దాడుల్లో ధ్వంసమైన మేరియుపోల్‌ సిటీ- ఫైల్‌ ఫొటో)

మేరియుపోల్‌: రష్యా సేనలు ముప్పేట జరిపిన దాడులతో ఉక్రెయిన్‌లో అందమైన పోర్టు సిటీగా పేర్గాంచిన మేరియుపోల్‌ శ్మశానంలా మారింది. అక్కడ తవ్వేకొద్దీ శవాల గుట్టలు బయటపడుతుండటంతో భయానక వాతావరణం నెలకొంది. రష్యా సేనలు దాదాపు మూడు నెలలుగా జరిపిన దాడులతో దద్దరిల్లిన మేరియుపోల్‌లో తాజాగా ఓ భవనం శిథిలాల కింద 200 మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. కార్మికులు భవనం వద్ద శిథిలాలను తవ్వుతుండగా 200 మృతదేహాలు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. కుప్పకూలిన అపార్టుమెంట్‌ పునాదుల్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు బయటపడ్డాయని, ఆ పరిసరాల్లో దుర్వాసన వ్యాపించినట్టు మేరియుపోల్‌ నగర మేయర్‌ సలహాదారు పెట్రో అండ్రయూషెచెన్కో వెల్లడించారు. మేరియుపోల్‌ నగరం ఇటీవల రష్యా వశమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లోనే ఈ నగరంపై పట్టు సాధించినా.. అజోవ్‌స్టాల్‌ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయింది. అయితే, బుధవారం నాటికి అజోవ్‌స్టాల్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవడంతో మేరియుపోల్‌ తమ వశమైనట్టు రష్యా ఇటీవల ప్రకటించింది.

90 రోజులు.. 29వేల మంది రష్యా సైనికులు హతం!

మరోవైపు, గత 90 రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడుల్ని ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. అంతేకాకుండా రష్యాను తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. ఇప్పటివరకు 29,350 మంది రష్యా సైనికుల్ని చంపడంతో పాటు 205 విమానాలను కూల్చినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అంతేకాకుండా, 170 హెలికాప్టర్లు, 1302 ట్యాంకులు, 3194 సాయుధ శకటాలు వంటి యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి  శత్రు దేశాన్ని దెబ్బతీసినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపింది. రష్యా దాడులతో ఇప్పటివరకు 234మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 433 మంది గాయపడినట్టు ఉక్రెయిన్‌ ప్రోసిక్యూటర్‌ జనరల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు