Ukraine Crisis: మరియుపోల్‌లో థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి!

ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌, ఖర్కివ్‌, మరియుపోల్‌ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబు దాడులతో....

Updated : 25 Mar 2022 16:52 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌, ఖర్కివ్‌, మరియుపోల్‌ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబు దాడులతో విజృంభిస్తున్నాయి. మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై జరిపిన బాంబు దాడిలో 300 మంది మృతిచెందినట్టు సమాచారం. ఉక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని అధికారులు తెలిపినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మరియుపోల్‌లోని ఓ డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

మరోవైపు, గత నెలరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో లక్షలాది ప్రజలు తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా బలగాల షెల్లింగ్‌ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 

16వేల మందికి పైగా రష్యా సైనికుల హతం

ఇదిలా ఉండగా.. రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 16,100 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ రక్షణమంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో పాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ప్రకటించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని