Srilanka Crisis: శ్రీలంకలో 36గంటల కర్ఫ్యూ.. భద్రత కట్టుదిట్టం.. టాప్‌ 10 పాయింట్స్‌!

శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం, కాగితం కొరతతో పరీక్షలు వాయిదా, డీజిల్‌ విక్రయాల నిలిపివేత,......

Published : 02 Apr 2022 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం, కాగితం కొరతతో పరీక్షలు వాయిదా, డీజిల్‌ విక్రయాల నిలిపివేత, రోజుకు 13 గంటల పాటు విద్యుత్‌ కోత.. ఈ పరిణామాలన్నీ ఆ దేశం ఎదుర్కొంటున్న దురావస్థకు అద్దంపడుతున్నాయి. దీంతో లంకలో జనాగ్రహం పెల్లుబికుతోంది. రోడ్లపైకి వచ్చిన జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే, జనం వీధుల్లోకి రాకుండా 36గంటల పాటు కర్ఫ్యూ విధించారు. 

  1. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న వేళ దేశవ్యాప్తంగా శనివారం అత్యవసర పరిస్థితి విధిస్తూ గొటబాయ రాజపక్స గెజిట్‌ విడుదల చేశారు. భద్రతా దళాలకు విస్తృత అధికారులు ఇచ్చారు.
  2. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజా భద్రత, రక్షణతో పాటు ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరా, సేవల నిర్వహణ కొనసాగేందుకు  ఎమర్జెన్సీ విధించినట్టు గొటబయ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచే ఎమర్జెన్సీ అమలులోకి వచ్చినట్టు గెజిట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 
  3. అలాగే, శ్రీలంకలో 36గంటల కర్ఫ్యూ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని శ్రీలంక సమాచార శాఖ వెల్లడించింది. ప్రజల నిరసనల్ని అడ్డుకొనేందుకు ప్రకటించిన కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలకు మినహా పౌరులెవరినీ బయటకు అనుమతించరు. 
  4. దాదాపు 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి అత్యంత ఘోరమైన తిరోగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అత్యవసరమైన వస్తువుల దిగుమతులకు సైతం విదేశీ కరెన్సీ కొరత ఉండటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి. 
  5. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ఫ్రీడం పార్టీకి చెందిన మైత్రిపాల సిరిసేన, గొటబయ రాజపక్సకు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని పెడచెవిన పెడితే కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని హెచ్చరించారు. 
  6. ఆకలితో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. మార్చి రెండో వారం నుంచి లంకకు ఐఓసీ చమురు సరఫరా చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్‌ లైన్‌ పొందాక మన వ్యాపారులు ఆహార సహాయంగా శ్రీలంకకు తక్షణ రవాణా కోసం 40 వేల టన్నుల బియ్యాన్ని పంపే ప్రక్రియను మొదలు పెట్టినట్టు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.
  7. బస్సులు, ఇతర వాణిజ్య వాహనాలకు డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజా రవాణా కుంటుపడింది. ఇప్పటికే ఉన్న చమురు కూడా అయిపోవడంతో ఈరోజు తర్వాత అత్యవసర సర్వీసుల్ని సైతం ఇకపై నడపలేమంటూ ప్రైవేటు బస్సుల యజమానులు తేల్చి చెప్పారు. దేశంలో 60 శాతం ప్రజారవాణా ప్రైవేటు బస్సులపైనే ఆధారపడి ఉంది. 
  8. ఆర్థిక సంక్షోభంపై ఆగ్రహించిన జనం శ్రీలంక అధ్యక్షుడు  రాజపక్స ఇంటి వద్ద హింసాత్మకంగా నిరసనలు తెలపడాన్ని ప్రభుత్వం ఉగ్రవాద చర్యగా పేర్కొంటోంది. ఈ ఘటనకు ప్రతిపక్ష పార్టీలతో సంబంధం ఉన్న అతివాదశక్తులే కారణమని నిందిస్తోంది. 
  9. శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంట గ్యాస్‌ వంటి నిత్యావసర వస్తువలకు కొరత ఏర్పడింది. రోజుకు 13గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. 
  10. శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. పలుచోట్ల చెలరేగుతున్న హింసకు అతివాద శక్తులతో సంబంధం ఉన్న విపక్షాలు ఎస్‌జేబీ, కేవీపీ పార్టీలదే బాధ్యత అన్నారు. అలాగే, ఆరోగ్యశాఖ మంత్రి ఖెహెలియా రాంబుక్వెల్లా మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్‌ వైఫల్యం వల్లే నిరసనలు జరిగాయనీ.. తమ అధ్యక్షుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని