Israel: నెతన్యాహూ విజయంతో ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు

ఇజ్రాయెల్‌  ప్రధానిగా బెంజిమన్‌ నెతన్యాహూ ఎన్నికైన వేళ గాజా పట్టీ నుంచి రాకెట్‌ దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్‌ దళాలు గట్టిగా జవాబిచ్చాయి.

Updated : 04 Nov 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధానిగా బెంజిమన్‌ నెతన్యాహూ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమైన వెంటనే ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు మొదలయ్యాయి. నిన్న ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గాజాపట్టీ నుంచి నాలుగు రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించారు. వీటిల్లో ఒక్కదానిని ఐరన్‌డోమ్‌ వ్యవస్థ అడ్డుకొంది. ఈ దాడులకు ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ బాధ్యతను తీసుకొంది. అల్‌-బద్ర్‌ గ్రూప్‌ కమాండర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది.

ఈ దాడికి ఇజ్రాయెల్‌ కూడా గట్టిగానే జవాబిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ దళాలు గాజాపట్టీలోని ఓ రాకెట్‌ ఫ్యాక్టరీపై దాడి చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు హమాస్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్న అండర్‌గ్రౌండ్‌ రాకెట్‌ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. మధ్య గాజాలోని అల్‌ మఘాజీ శరణార్థి శిబిరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఏప్రిల్‌ నుంచి ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసిన మూడో ఆయుధ ఫ్యాక్టరీ ఇది. ఈ దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగిందో సమాచారం తెలియలేదు.

ఇజ్రాయెల్‌లో 2019 నుంచి కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు గురువారం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు చెందిన లికడ్‌ పార్టీ నేతృత్వంలోని మితవాద కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. గురువారం 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ కూటమి 64 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇజ్రాయెల్‌ పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 120. ఈ నేపథ్యంలో నెతన్యాహు మళ్లీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే. మరోవైపు- ప్రస్తుత ప్రధాని యయిర్‌ లపిడ్‌ ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని