Updated : 18 Mar 2022 19:24 IST

Ukraine Crisis: డ్రాగన్‌ ‘హ్యాండ్‌ ఇస్తోందా’..?

 రష్యా ఆశించిన స్థాయిలో సహకరించని చైనా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచంలోనే చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. సప్లైఛైన్‌లో అత్యంత కీలకమైన దేశం.. సైనిక శక్తిలో మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా మద్దతుతో సంక్షోభం నుంచి బయటపడొచ్చన్న రష్యా ఆశలు పెద్దగా ఫలిస్తున్నట్లు లేవు. రష్యాను అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేయాలని అమెరికా, పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రతి ప్రయత్నం చైనాకు లబ్ధిచేకూరుస్తోంది.  వాస్తవానికి రష్యాపై చైనా ప్రకటనల్లో ఉన్నంత ప్రేమ.. సాయం చేయడంలో కనిపించడంలేదు. అంతర్జాతీయ వేదికలపై మాట సాయం.. ఓటు సాయం  చేస్తోందే కానీ.. ఆర్థిక సహకారం మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. ఫలితంగా రష్యా బలహీనపడి పూర్తిగా చైనా ఆధిపత్యం పెరిగేలా పరిణామాలు మారుతున్నాయి. మరోపక్క తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో నేరుగా ఫోన్‌కాల్‌ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రష్యాకు సాయం ఆపేలా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ ఫోన్‌కాల్‌ విషయాన్ని శ్వేతసౌధం కూడా ధ్రువీకరించింది.

సైనిక సాయానికి దూరం..

‘‘ఈ సంక్షోభంలో చైనాకు సంబంధం లేదు.. అదే సమయంలో ఆంక్షలు చైనాపై ప్రభావం చూపాలని అనుకోము’’ అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ మంగళవారం స్పెయిన్‌ మంత్రితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై తాము దాడి చేయాలనుకోవడంలేదని.. అవసరమైతే ఆర్థిక సాయం అందిస్తామని కూడా చైనా ప్రకటించింది. చైనా నుంచి రష్యాకు ఆయుధాలు వెళ్లే అవకాశం ఉందని ఆంగ్లపత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ, చైనా వీటిని తప్పుడు ప్రచారంగా ప్రకటించి తోసిపుచ్చింది. 

రూబుల్‌ పతనంలో ప్రేక్షకపాత్ర..

చైనా కరెన్సీ యువాన్‌ ట్రేడింగ్‌ స్వేచ్ఛగా జరగదని ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడి పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా యువాన్‌ ట్రేడింగ్‌ రేంజిని నిర్దేశిస్తుంది. గత వారం రష్యా కరెన్సీ రూబుల్‌తో ట్రేడింగ్‌ రేంజిని దాదాపు రెట్టింపు చేసింది. డాలర్‌, యూరోతో పోలిస్తే యుద్ధం మొదలైనప్పటి నుంచి 20శాతం పతనమైంది. మరోవైపు యువాన్‌తో పోలిస్తే కూడా రూబుల్‌ పతనమైంది. ఆ సమయంలో పీబీవోసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా చైనా దిగుమతులకు రష్యన్లు యువాన్ల కోసం భారీగా రూబుల్స్‌ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. చైనా నుంచి కార్లు, ఫోన్లు వంటి రష్యాకు వెళతాయి. ఆ దేశ మార్కెట్లో చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్స్‌, గీలీ ఆటోలు 7శాతం వాటా ఆక్రమించాయి. పశ్చిమ దేశాల బ్రాండ్లు రష్యాను వీడటంతో చైనా బ్రాండ్లు  ఆక్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా-రష్యా మధ్య 25బిలియన్‌ డాలర్లు విలువైన వ్యాపారం యువాన్‌ కరెన్సీలో జరుగుతోంది. 

యువాన్లను డాలర్లుగా మార్చేందుకు అనుమతిస్తుందా..?

రష్యా వద్ద దాదాపు 630 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ రిజర్వులు ఉన్నాయి. తాజా ఆంక్షల కారణంగా ఆ రిజర్వులోని 315 బిలియన్‌ డాలర్లు విలువైన కరెన్సీలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. వీటిల్లో యూరో, డాలర్‌, జపాన్‌ కరెన్సీ వంటివి ఉన్నాయి. దీంతో మిగిలిన వాటిలో రష్యా వద్ద ఉన్న 90 బిలియన్‌ డాలర్ల విలువైన యువాన్లు కీలకమైనవి. చైనా  సాయం చేయాలనుకుంటే ఈ యువాన్ల ద్వారానే సాయం చేయవచ్చు. వీటిని విక్రయించి డాలర్లు కొనుగోలు చేసేందుకు అనుమతించే అవకాశం ఉంది. కానీ, ఇది ఒక రకంగా పశ్చిమ దేశాల ఆంక్షలను ఉల్లంఘించడమే. ఈ చర్యతో ఆయా దేశాలు డ్రాగన్‌పై చర్యలు తీసుకొనే ప్రమాదం ఉంది. ఫలితంగా డ్రాగన్‌కు రష్యా దగ్గరకావడంతో వచ్చే లాభం కంటే.. పశ్చిమ దేశాల పెట్టుబడులు పోవడంతో వచ్చే నష్టమే ఎక్కువ. ఈ ఆర్థిక సాహసానికి పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా పూనుకొంటుందనుకోలేము. 

విమానాల విడిభాగాల్లో మొండిచెయ్యి..

అమెరికాకు చెందిన బోయింగ్‌, ఐరోపాకు చెందిన ఎయిర్‌ బస్‌ సంస్థలు రష్యాతో సంబంధాలను తెగదెంపులు చేసుకొన్నాయి. ఆ దేశంలోని విమానాలకు విడిభాగాలను సరఫరా చేయమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రష్యా విడిభాగాలు సరఫరా చేయాలని చైనాను కోరింది. కానీ, ఈ ప్రతిపాదనకు డ్రాగన్‌ నిరాకరించినట్లు రష్యాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎయిర్‌ వర్త్‌నెస్‌ సంస్థ అధిపతి వాల్రెకుదినోవ్‌ పేర్కొన్నట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో టర్కీ, ఇండియాపై రష్యా ఆశలు పెట్టుకొంది. మరోపక్క రష్యా-చైనా సంయుక్తంగా సీఆర్‌929 విమానం అభివృద్ధి చేయడం మొదలుపెట్టాయి. కానీ, ఈ ప్రాజెక్టు 2029 వరకు పూర్తయ్యే పరిస్థితి లేదు.

పెట్టుబడులు నిలిపివేత..

క్రిమియా ఆక్రమణ తర్వాత 2014లో రష్యా, 2020లో బెలారస్‌ల్లో తన కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్‌ నిలిపివేసింది. ఈ బ్యాంక్‌లో అమెరికా ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ, బీజింగ్‌ కేంద్రంగా పనిచేసే ఆసియాన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ కూడా ఉక్రెయిన్‌పై దాడి మొదలు కాగానే రష్యా, బెలారస్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. బ్యాంక్‌ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. వాస్తవానికి ప్రపంచ బ్యాంక్‌ (అమెరికా), ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (జపాన్‌)ల్లో తన ప్రత్యర్థులు ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో చైనా 2016లో ఆసియాన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ను ప్రారంభించింది.  తాజాగా ఈ బ్యాంక్‌ నిర్ణయంతో రష్యాలోని 1.1 బిలియన్‌ డాలర్ల విలువైన రైలు, రోడ్‌ ప్రాజెక్టులు నిలిచిపోనున్నాయి. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని