Kuwait Fire: కువైట్‌ అగ్నిప్రమాదం.. మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. గల్ఫ్‌కు కేంద్రమంత్రి పయనం

కువైట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన భారతీయుల సంఖ్య 40కి చేరింది.

Published : 12 Jun 2024 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కువైట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ ప్రమాదంలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్లు గుర్తించగా.. అందులో 40 మంది భారతీయులేనని తెలిసింది. గాయపడిన వారిలోనూ అనేక మంది ఇండియన్లే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలబడేందుకు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితులను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సమీక్షిస్తోందని.. మనవారికి అన్నివిధాలా సహాయం అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

కువైట్‌కు కేంద్రమంత్రి..

అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి అందుతోన్న సహాయాన్ని పర్యవేక్షించేందుకు గాను భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ కువైట్‌కు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన వెంటనే తాను బయల్దేరనున్నట్లు ఆయన వెల్లడించారు. వీలైనంత తొందరగా మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రమంత్రిని గల్ఫ్‌కు పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం సైతం ఓ ప్రకటనలో తెలిపింది. 

బాధితుల్లో కేరళవాసులే అధికం

కువైట్‌ భవనం వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారిలో ఎక్కువగా కేరళ, తమిళనాడుకు చెందినవారే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా మలయాళీలు ఉన్నారని.. వారికి తక్షణ సహాయం అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని