USA Mass Shooting: తుపాకీ నీడన అమెరికా.. అత్యాధునిక ఆయుధంతో 22ఏళ్ల యువకుడి కాల్పులు

అమెరికాను తుపాకీ నీడ వీడటంలేదు. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో కూడా ఓ దుండగుడు అత్యాధునిక రైఫిల్‌తో మారుణ హోమానికి పాల్పడ్డాడు. ఫలితంగా

Updated : 05 Jul 2022 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాను తుపాకీ నీడ వీడటంలేదు. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో కూడా ఓ దుండగుడు అత్యాధునిక రైఫిల్‌తో మారణహోమానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జులై 4వ తేదీన అమెరికాలోని చికాగో శివార్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్‌లో ఓ ముష్కరుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆరుగురు చనిపోగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు  ఓ రిటైల్‌ స్టోర్‌పైకి ఎక్కి అక్కడి  నుంచి పరేడ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన పరేడ్‌ ప్రారంభమైన నిమిషంలోనే చోటు చేసుకొంది.

22 ఏళ్ల కుర్రాడిపై అనుమానం 

కాల్పులకు పాల్పడిన దుండగుడిని రాబర్ట్‌ క్రిమో (22)గా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రాబర్ట్‌ క్రిమో కోసం హైలాండ్‌ పోలీసులు వేట మొదలు పెట్టారు. అతడు పారిపోతుండగా ట్రాఫిక్‌ అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. అతడిని ‘పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పోలీసు శాఖ ప్రకటించింది. అతడు కాల్పులు జరిపిన ప్రదేశంగా భావిస్తున్న దుకాణం గోడకు ఓ నిచ్చెన వేసి ఉందని.. దుకాణంపైన కాల్పులు జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అత్యంత  శక్తిమంతమైన రైఫిల్‌ను వినియోగించినట్లు లేక్‌ కౌంటీ మేజర్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. దాడికి వినియోగించిన ఆయుధాన్ని ఎక్కడ కొనుగోలు చేశాడనే విషయంపై దర్యాప్తు మొదలైంది. 

స్పందించిన జోబైడెన్‌..

ఈ కాల్పుల ఘటనతో హైలాండ్‌ ప్రాంతంలో వేడుకలను రద్దు  చేయాలని పోలీసులు ఆదేశించారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసినట్లు పేర్కొన్నారు. మతిలేని ఈఘటన స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలో విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు.   

కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ పరేడ్‌ను చూసేందుకు ఉత్సాహంగా వచ్చి వీధి పక్కనే కూర్చొన్న ప్రేక్షకులు.. కాల్పులు ప్రారంభం కాగానే తీవ్ర భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏటా 40 వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా..

అమెరికాలో ఏటా తుపాకీ కాల్పుల ఘటనల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గన్‌ వైలెన్స్‌ ఆర్కైవ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే 309 కాల్పుల ఘటనలు అమెరికాలో చోటు చేసుకొన్నాయి. వీటిల్లో జులై4వ తేదీనే మూడు చోట్ల కాల్పులు జరిగాయి. కాకపోతే వాటిల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని