Yarshagumba: ‘హిమాలయన్‌ వయాగ్రా’ కోసం వెళ్లి.. మంచుకొండల్లో ఆరుగురు గల్లంతు

హిమాలయన్‌ వయాగ్రాగా (Himalayan Viagra) పిలిచే ఓ మూలిక కోసం వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. నేపాల్‌లోని హిమాలయ ప్రాంతంలో (Himalayan Mountains) మంచుతుపాను రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 04 May 2023 01:40 IST

కాఠ్‌మాండూ: హిమాలయాల్లో (Himalayan Mountains) పర్వతారోహకుల సాహస యాత్రలే కాకుండా ఎంతో విలువైన మూలికల కోసం అక్కడి స్థానికులు పర్యటిస్తుంటారు. ఇందుకోసం మంచుకొండల్లో నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ‘హిమాలయన్‌ వయాగ్రా (Himalayan Viagra)’గా పిలిచే అత్యంత విలువైన మూలిక (Yarshagumba) తీసుకొచ్చేందుకు వెళ్లిన వారిలో కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్‌లో (Nepal) చోటుచేసుకుంది. హిమపాతంలో చిక్కుకున్న వారికోసం గాలింపు చేపట్టగా అందులో ఆరుగురి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు.

నేపాల్‌ ధార్‌చులా జిల్లాలోని కొండల్లో మంగళవారం నాడు భారీ హిమపాతం సంభవించింది. అదే సమయంలో యర్షగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచుతుపానులో గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అందులో కొందర్ని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. మరో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీల ఆచూకీ మాత్రం లభించలేదు. వారిని గాలింపు కోసం 25 మంది భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి పంపించినట్లు స్థానిక డీఎస్‌పీ దత్తా వెల్లడించారు. మరో ఘటనలో యర్షగుంబా తీసుకువచ్చేందుకు వెళ్లిన మరో మహిళ కూడా హిమపాతంలో మునిగిపోయిందని బజ్‌హింగ్‌ జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఆమె గాలింపు కోసం ప్రత్యేక బృందాన్ని పంపించామని అన్నారు.  

యర్షగుంబా (Yarshagumba) అనేది హిమాలయాల్లో లభించే అత్యంత విలువైన మూలిక. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ (Cordyceps)ను హిమాలయన్‌ గోల్డ్‌ లేదా గొంగళి పురుగు ఫంగస్‌ (Caterpillar Fungus)గా చెబుతుంటారు. హిమాలయ ప్రాంతంలో అత్యంత అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఈ మూలికల్లో ఉంటుందని భావిస్తుంటారు. అందుకే దీనిని ‘హిమాలయన్‌ వయాగ్రా (Himalayan Viagra)’గా పేర్కొంటారు. నేపాల్‌ మార్కెట్లోనే దీని ధర గ్రాముకు రూ.50వేలకు పైగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ మరింత ఎక్కువ. ఈ మూలిక కోసం చైనా సైనికులు భారత భూ భాగంలోకి పదేపదే చొరబాట్లకు పాల్పడుతుంటారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని