Tour Total: వయసు 60.. 48 అంతస్తుల భవనాన్ని అవలీలగా ఎక్కేశాడు!

ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే.. వయసు అడ్డంకి కాదనే సందేశాన్ని ఇచ్చారు ఫ్రాన్స్‌(France)కు చెందిన అలైన్‌ రాబర్ట్‌(Alain Robert). తన 60 ఏళ్ల వయస్సులోనూ ఏకంగా 48 అంతస్తుల భవనాన్ని ఆయన....

Published : 19 Sep 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే.. వయసు అడ్డంకి కాదనే సందేశాన్ని ఇచ్చారు ఫ్రాన్స్‌(France)కు చెందిన అలైన్‌ రాబర్ట్‌(Alain Robert). తన 60 ఏళ్ల వయస్సులోనూ ఏకంగా 48 అంతస్తుల భవనాన్ని ఆయన చకచకా ఎక్కేయడం గమనార్హం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఎత్తయిన భవంతులను ఎక్కి ‘ఫ్రెంచ్‌ స్పైడర్‌మ్యాన్‌’గా గుర్తింపు పొందిన ఆయన.. గత నెలలో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పారిస్‌లోని 187 మీటర్ల ఎత్తయిన 48 అంతస్తుల భవనం ‘టూర్‌ టోటల్‌(Tour Total)’ను ఎక్కేశారు. 60 నిమిషాల్లోనే ఆయన భవనం పైఅంతస్తుకు చేరుకోవడం విశేషం.

‘60 ఏళ్లున్నా ఏం కాదనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనుకుంటున్నా. ఈ వయసులోనూ ఆటలాడొచ్చు. చురుకుగా ఉండండి.. అద్భుతమైన పనులు చేయండి’ అని రాబర్ట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నాకు 60 ఏళ్లు నిండాక.. ఈ టవర్‌ను మళ్లీ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఎందుకంటే ఫ్రాన్స్‌లో 60 ఏళ్లను పదవీ విరమణ వయస్సుగా పరిగణిస్తారు. దీనికి భిన్నంగానే ఈ ప్రయత్నం చేశా’ అని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన గతంలోనూ అనేకసార్లు ఈ టవర్‌ను ఎక్కారు. ఎత్తయిన భవనాలు ఎక్కడంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని