Heavy Rains: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో పాక్‌ అతలాకుతలం.. 68 మంది మృతి

కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. కరాచీ నగరంతో పాటు సింధ్‌, బలూచిస్థాన్‌ ప్రావెన్స్‌లల్లో కురిసిన భారీ వర్షాలు......

Published : 12 Jul 2022 02:18 IST

(భారీ వర్షాలతో సోమవారం నదిని తలపిస్తున్న కరాచీ వీధులు..)

కరాచీ: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. కరాచీ నగరంతో పాటు సింధ్‌, బలూచిస్థాన్‌ ప్రావెన్స్‌లల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ధాటికి 68మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆయా ప్రావెన్స్‌ల్లోని అనేక ప్రాంతాలు జలమయం కాగా.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కరాచీలో గోడ కూలిపోవడంతో నలుగురికి విద్యుదాఘాతానికి గురికాగా.. ఒకరు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో సహజ జలమార్గాలపై ఇళ్లు నిర్మించడం వల్లే అక్కడ అధిక ప్రాణ నష్టానికి కారణమని బలూచిస్థాన్‌ హోంమంత్రి మిర్‌ జియాఉల్లా లాంగోవ్‌ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆ ప్రాంతానికి చెందినవారేనన్నారు. బలూచిస్తాన్‌లోని ఆకస్మిక వరదలు, కుంభవృష్టి కారణంగా 50 మందికి పైగా గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు.

కుండపోత వానలతో వచ్చిన ఆకస్మిక వరదలతో పలు చోట్ల చెక్‌ డ్యామ్‌లు, వంతెనలు కొట్టుకుపోయాయి. మరోవైపు, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లోని కడాని డ్యామ్‌ కొట్టుకుపోతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. జులై 18, 19 తేదీల వరకు కరాచీ నగరంతో పాటు సింధ్‌ ప్రావిన్స్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పాకిస్థాన్‌ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. పాకిస్థాన్‌లో ఏటా వర్షాకాలం వస్తే చాలు నగరాలన్నీ ఈ ప్రళయంతో పోరాడాల్సి వస్తుందని.. పేలవమైన ప్రభుత్వ ప్రణాళికలే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని