Omicron: గత వారం ఐరోపాలో 70 లక్షల ఒమిక్రాన్ కేసులు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాల్లో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

Published : 11 Jan 2022 23:51 IST

కోపెన్‌ హాగెన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా  విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాల్లో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. జనవరి మొదటివారంలో ఐరోపాలో 70 లక్షలకు పైగా ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగుచూశాయి. రెండు వారాల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఆరోగ్య సంస్థ ఐరోపా డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే మీడియాతో మాట్లాడుతూ.. ఐరోపా ప్రాంతంలోని 26 దేశాల్లోని జనాభాలో ఒకశాతం కంటే ఎక్కువ మంది ప్రతివారం కొవిడ్ బారినపడుతున్నారని వెల్లడించారు. ఈ కేసుల పెరుగుదలతో వైద్య వ్యవస్థ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోనుందని హెచ్చరించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెట్రిక్స్ అంచనాలను ఉదహరిస్తూ.. రానున్న 6-8 వారాల్లో పశ్చిమ ఐరోపాకు చెందిన దాదాపు సగం మంది ప్రజలు కరోనా బారినపడతారని తెలిపారు. గతంలో ఏ వేరియంట్ ప్రబలనంత వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోందని హెచ్చరించారు. అలాగే వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాలపై ఈ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపనుందన్నారు. ప్రజలంతా కొవిడ్ నియమాలు పాటించాలని, ఇంటిలోపల కూడా మాస్కులు ధరించాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని