Israel: ఇజ్రాయెల్‌ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి

హమాస్‌ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ఆర్మీ ధ్రువీకరించింది. 

Published : 16 Jun 2024 01:05 IST

జెరూసలెం: గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ (Israel)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజా (Gaza)లో తమ దళాలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ (Israel Army)  ప్రకటించింది. పేలుడు కారణంగా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించలేదు. మృతి చెందిన వారిలో కంబాట్‌ ఇంజినీరింగ్‌ కార్ప్‌కు చెందిన డిప్యూటి కంపెనీ కమాండర్‌ వాసీం మహమూద్‌(23) ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో గాజాలో హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకేసారి 21 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించారు. ఈ తర్వాత భారీ సంఖ్యలో చనిపోవడం ఇది రెండోసారి. హమాస్‌తో యుద్ధంలో ఇప్పటివరకు 307 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి చెందారు.   

సైనికులు రాత్రిపూట తమ ఆపరేషన్‌ ముగించుకొని, విశ్రాంతి కోసం స్వాధీనం చేసుకున్న భవనాలకు కాన్వాయ్‌లో వెళ్తుండగా, ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పేలుడుతో ఆర్మర్డ్‌ కంబాట్‌ ఇంజినీరింగ్‌ వెహికల్‌ (CEV)లో ఉన్న సైనికులు చనిపోయారు.

అంతకుముందు ఇదే విషయానికి సంబంధించి హమాస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రఫాలోని టెల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతంలో సైనికులతో వెళ్తున్న వాహనాన్ని తమ ఫైటర్లు పేల్చివేసినట్లు పేర్కొంది. ఈ ఘటనలో పలువురు సైనికులు చనిపోయారని తెలిపింది. మరోవైపు రఫాని గుప్పిటపట్టి ఉంచేందుకు ఇజ్రాయెల్‌ దళాలు గత కొన్ని వారాలుగా ముందుకువెళ్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. రఫాలో హమాస్‌ నిర్మించిన సొరంగాలను గుర్తించి భారీ ఎత్తు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. 

మరోవైపు కాల్పుల విరమణకు సంబంధించి ఐరాసతోపాటు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో సైనికులపై దాడి తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1200 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందగా, సుమారు 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. అనంతరం హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు గాజాపై భారీ ఎత్తున వైమానిక, భూతల దాడులు చేపట్టింది. ఇప్పటివరకు ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో 37,000 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాజాలో నివసిస్తున్న 23 లక్షల మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు