Ukraine: ఉక్రెయిన్‌ సమగ్రతను గౌరవించాలి

ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి.

Updated : 17 Jun 2024 06:31 IST

శాంతి ఒప్పందానికి అదే ప్రాతిపదిక కావాలి
స్విట్జర్లాండ్‌ సదస్సులో పలు దేశాల పిలుపు
 

ఒబర్జెన్‌ (స్విట్జర్లాండ్‌): ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. ‘ఉక్రెయిన్‌లో శాంతి’ అంశంపై స్విట్జర్లాండ్‌లోని బర్జెన్‌స్టాక్‌ రిసార్టులో శనివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదలతో ముగిసింది. 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడం, అణు భద్రత, ఆహార భద్రత, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఐక్యరాజ్య సమితి ఒప్పందాలతోపాటు ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించేలా యుద్ధం ముగింపు దిశగా కీలక ఒప్పందం కుదరాలని సంయుక్త ప్రకటనలో వారు ఆకాంక్షించారు. అప్పుడే ఉక్రెయిన్‌లో దీర్ఘకాలం శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.  ఈ సదస్సులో రష్యా పాల్గొనలేదు.

ఆ సాయం సరిపోదు: జెలెన్‌స్కీ 

స్విట్జర్లాండ్‌ సదస్సులో పాల్గొన్న దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి అంతర్జాతీయ మద్దతు తరిగిపోవడం లేదని ఈ సదస్సు చాటిచెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తమపై యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదని, ఆయన్ను ఎలాగైనా నిలువరించాలని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల నుంచి అందుతున్న సాయం.. తాము యుద్ధం గెలిచేందుకు సరిపోదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌ భూభాగాన్ని వీడితే.. వెంటనే ఆ దేశంతో శాంతి చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. చైనా తమకు శత్రువేమీ కాదని జెలెన్‌స్కీ అన్నారు. చైనా ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తున్నామని, ఆ దేశం నుంచీ అదే ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. 


సంయుక్త ప్రకటనపై సంతకం చేయని భారత్‌ 

స్విట్జర్లాండ్‌ శాంతి సదస్సులో పాల్గొన్నప్పటికీ భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బ్రెజిల్‌ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఇవన్నీ బ్రిక్స్‌ కూటమిలో సభ్యదేశాలే. రష్యాతో వీటికి బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తామని భారత్‌ స్పష్టం చేసింది. సంక్షోభ పరిష్కారానికి అన్నింటికంటే ముఖ్యంగా మాస్కో, కీవ్‌ నిజాయతీగా ప్రయత్నించాలని సూచించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (పశ్చిమ దేశాలు) పవన్‌ కపూర్‌ మన దేశం తరఫున సదస్సుకు హాజరయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మధ్యవర్తి తరహా పాత్ర పోషిస్తున్న తుర్కియే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసింది. సదస్సుకు చైనా హాజరు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని