Swiss Summit: ‘ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’

ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపు విషయంలో ఏదైనా శాంతి ఒప్పందానికి.. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు ముక్తకంఠంతో పిలుపునిచ్చాయి.

Published : 16 Jun 2024 23:26 IST

బెర్న్‌: ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం (Russia- Ukraine War) ముగింపు విషయంలో ఏదైనా శాంతి ఒప్పందానికి.. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు ముక్తకంఠంతో పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్‌ ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సు ముగింపు క్రమంలో ఈమేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అణు, ఆహార భద్రత, ఖైదీల మార్పిడి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి రూపొందించిన ఈ ప్రకటనపై భారత్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ తదితర దేశాలు మాత్రం సంతకం చేయలేదు.

ఐరాస చార్టర్‌తోపాటు ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం.. ఆ దేశంలో సుస్థిర శాంతి సాధనకు ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపు 100 దేశాలు సదస్సులో పాల్గొనగా వాటిలో చాలావరకు దీనికి అంగీకరించడం.. దౌత్యనీతి ఏం సాధించగలదో నిరూపిస్తోందని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు వియోలా అమ్హెర్డ్ పేర్కొన్నారు. తమ దేశంలో శాంతిస్థాపన దిశగా తొలి అడుగులు పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అయితే.. రష్యా, చైనా వంటివి సదస్సుకు దూరంగా ఉన్నాయి.

రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!

రెండేళ్లకు పైగా సాగుతోన్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు రష్యా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నాలుగు ప్రాంతాల నుంచి కీవ్‌ దళాలు వెళ్లిపోవడం, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను విరమించుకోవడం వంటి షరతులకు అంగీకరిస్తే సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అయితే, ఆయన ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ కీవ్‌ స్పందించింది. ఈ పరిణామాల నడుమ తాజా ప్రకటన వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని