Brazil: ముంచెత్తిన బురద ప్రవాహం.. మునిగిన బస్సులు.. కొట్టుకుపోయిన కార్లు

బ్రెజిల్‌లోని పెట్రోపొలిస్‌ నగరంలో మంగళవారం తెల్లవారుజామున వరదలు,

Updated : 18 Feb 2022 10:47 IST

బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 117 మంది మృతి

పెట్రోపొలిస్‌: బ్రెజిల్‌లో ప్రకృతి ప్రకోపానికి వందలమంది బలయ్యారు. కొండల ప్రాంతంలో వరదలు, మట్టిచరియలు విరుచుకుపడి నివాస ప్రాంతాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో కనీసం 117 మంది మృతిచెందగా.. మరో 116 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వరదల ధాటికి కార్లు కొట్టుకుపోగా.. బస్సులు మునిగిపోయాయి. బురద ప్రవాహంతో చాలా మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని రియో డి జనేరో అధికారులు వెల్లడించారు. వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

పెట్రోపొలిస్‌ నగరంలో గత మంగళవారం కుండపోత వర్షం కురిసింది. కొన్ని దశాబ్దాల తర్వాత అక్కడ కేవలం మూడు గంటల్లోనే 25.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో వరదలు పొటెత్తాయి. ఫలితంగా మట్టి చరియలు విరిగిపడి సమీపంలోని నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహంలో రెండు బస్సులు మునిగిపోయిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నీటిలో మునిగిపోతున్న బస్సుల్లో నుంచి ప్రయాణికులు సాయం కోసం హాహాకారాలు చేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఈ బస్సులో కొంతమంది ప్రయాణికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

వీధుల్లో వరద ప్రవాహం ఇంకా తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టుకుపోయిన ఇళ్ల శిథిలాల వద్ద తమ వారి ఆచూకీ కోసం జనం మట్టిని తవ్వుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.  వీధుల్లో కార్లు గుట్టల్లా పోగుపడి ఉన్నాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 24 మందిని కాపాడారు. ఇంకా 116 మంది అచూకీ తెలియరాలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని