Ukraine Crisis: ఉక్రెయిన్‌పై పుతిన్‌ లెక్క తప్పింది.. తక్కువగా అంచనా వేశారు..!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దాడిచేస్తున్నారని.. ఉక్రెయిన్‌ ప్రజల హృదయాలను

Updated : 02 Mar 2022 10:57 IST

అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ పక్కా ప్రణాళికతోనే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగారని, అయితే ఆయన విసిరిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. అంతేగాక, ఉక్రెయిన్‌పై పుతిన్‌ అంచనాలు తప్పాయని అంటూ ఆ దేశ ప్రజల మనోధైర్యాన్ని ప్రశంసించారు.  అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. 

‘‘నియంతలు వారి దూకుడు చర్యలకు మూల్యం చెల్లించకపోతే వారు మరింత గందరగోళానికి కారణమవుతారు. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచానికి కూడా ముప్పు పెరుగుతుందని చరిత్ర చెబుతోంది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో స్థిరత్వం, శాంతి స్థాపన కోసం నాటో కూటమిని ఏర్పాటు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తోన్న పుతిన్‌ ఇప్పుడు ఉక్రెయిన్‌పై ఉద్దేశపూర్వకంగానే, పక్కా ప్రణాళికతో యుద్ధానికి దిగారు. దౌత్యపరమైన పరిష్కార యత్నాలకు కూడా ఆయన (పుతిన్‌) అంగీకరించడం లేదు. నాటో, పశ్చిమ దేశాలు స్పందించవేమో అని ఆయన అనుకుంటున్నారు. మమ్మల్ని(నాటో కూటమి) విడదీయొచ్చని పుతిన్‌ భావిస్తున్నారు. కానీ పుతిన్‌ ఆలోచన తప్పు. ఆయన విసిరిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని బైడెన్‌ స్పష్టం చేశారు. 

యుద్ధంలో ఉక్రెయిన్‌తో పాటు అమెరికా సేనలు పోరాడవని, అయితే నాటో సభ్యుల భూభాగాలపై దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని బైడెన్‌ రష్యాను హెచ్చరించారు. ఈ యుద్ధం వల్ల రష్యాకే భారీ నష్టం వాటిల్లుతుందని, ఆ దేశం మరింత బలహీనమవుతుందని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌ను తక్కువగా అంచనా వేశారు..

ఈ సందర్భంగా పుతిన్‌పై బైడెన్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌ లెక్క తప్పింది. ఆ దేశాన్ని తక్కువగా అంచనా వేశారు. తాను ఉక్రెయిన్‌లోకి సులువుగా వెళ్లగలనని అనుకున్నారు. కానీ ఆయన ఎన్నడూ ఊహించని ఓ మనో స్థైర్యాన్ని (ఉక్రెయిన్‌ ప్రజల ధైర్యాన్ని ఉద్దేశిస్తూ) ఢీ కొట్టారు. ఉక్రెయిన్‌ ప్రజలను ఢీకొట్టారు’’ అని బైడెన్‌ తెలిపారు. పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సైన్యంతో చుట్టుముట్టినా.. ఆ దేశ ప్రజలను మాత్రం గెలుచుకోలేరని అన్నారు. 

రష్యా విమానాలపై నిషేధం..

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధానికి ప్రతిస్పందన.. ఆ దేశంపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. ‘‘ఇప్పటికే అమెరికా, తన మిత్ర దేశాలతో కలిసి రష్యాపై శక్తిమంతమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమెరికా గగనతలంలోకి రష్యా విమానాలు రాకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘పుతిన్‌ ఓ నియంత. రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఉక్రెయిన్‌ ప్రజలతో అమెరికా ఉంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయి. యుద్ధ రంగంలో పుతిన్‌ లాభపడొచ్చు. కానీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని బైడెన్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని