Ukraine Crisis: సాయం అందనివ్వట్లేదు.. బయటకు వెళ్లనివ్వట్లేదు!

ఉక్రెయిన్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యన్‌ సేనలు.. వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.....

Updated : 13 Mar 2022 11:21 IST

సహాయక సామగ్రి కాన్వాయ్‌పైనా రష్యా దాడులు

కీవ్‌: ఉక్రెయిన్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యన్‌ సేనలు.. వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌ శివార్లలో భారీగా మోహరించిన బలగాలు మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగానూ పలు నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయా నగరాల్ని వీలైనంత త్వరగా గుప్పిట పట్టేందుకు రష్యన్‌ సేనలు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి. సైనిక సామగ్రి సరఫరాపైనా అస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి.

అంత్యక్రియలకూ అవకాశం లేదు..

శనివారం దాదాపు 4.30లక్షల మంది జనాభా ఉన్న మరియోపోల్‌కు అందుతున్న సాయాన్ని రష్యన్‌ సేనలు అడ్డుకున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులు జరిగాయి. అలాగే నగరాన్ని వీడి వెళుతున్న పౌరులనూ అడ్డుకుంటుండడం గమనార్హం. కీవ్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 7 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడించాయి. మరియోపోల్‌లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్‌ కార్యాలయం ప్రకటించింది. చివరకు మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉండడం లేదని స్థానికులు వాపోయారు.

విదేశీ సైనిక సామగ్రి సరఫరాపై దాడి చేస్తాం..

కాల్పుల విరమణ నిమిత్తం శనివారం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు సైనిక సామగ్రి కోసం 200 మిలియన్‌ డాలర్లు సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే, తమ సేనలు విదేశీ సైనిక సరఫరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని రష్యన్‌ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు.

లొంగిపోయే హక్కు మనకు లేదు.. జెలెన్‌స్కీ

మరోసారి వీడియో సందేశంలో మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమెర్‌ జెలెన్‌స్కీ.. తమ దేశాన్ని ముక్కలుగా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా కొన్ని నగరాల్లో సూడో రిపబ్లికన్ల ముసుగులో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తోందన్నారు. లుహాన్క్స్‌, దొనెట్స్క్‌ తరహాలో నిరసనలను శ్రీకారం చుడుతోందన్నారు. అలాగే మరియోపోల్‌ నగర మేయర్ అపహరణతో ఓ కొత్త రకం ఉగ్రవాదానికి తెరతీస్తోందని ఆరోపించారు. వీటన్నింటినీ ఉక్రెయిన్‌ సమర్థంగా ఎదురొడ్డి నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రవేశించిన యుద్ధ యంత్రాన్ని ముక్కలు చేసేందుకు తమకు మరింత సమయం, బలం కావాలని వ్యాఖ్యానించారు. పౌరులు తమ ప్రతిఘటనను కొనసాగించాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే హక్కు లేదన్నారు. ఎంత కష్టమైనా పోరాడాలంటూ ఉక్రెయిన్‌ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 1,300 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించినట్లు తెలిపారు.

మరోవైపు మరియోపోల్‌ పోర్టు ముట్టడికి రష్యన్‌ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అందులో భాగంగా నగర తూర్పు ప్రాంతంపై ఇప్పటికే పట్టు సాధించాయని పేర్కొంది. ఆసుపత్రి సిబ్బంది ఉన్న ఓ తొమ్మిది అంతస్తుల భవనంపై రష్యన్‌ సేనలు కాల్పులు జరిపినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని