రష్యాతో చర్చలకు సిద్ధం.. ఉక్రెయిన్‌ ప్రకటన

రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.

Updated : 27 Feb 2022 19:58 IST

కీవ్‌: రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు బెలారస్‌ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. చర్చలకు ఒప్పుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది. చర్చలకు రాకుండా ఉక్రెయిన్‌ నాయకత్వం సమయం వృథా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్‌ నుంచి ఈ ప్రకటన వెలువడం గమనార్హం.

‘ఉక్రెయిన్‌-బెలారస్‌ సరిహద్దు ప్రాంతమైన ప్రిప్యాట్‌ నది సమీపంలో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపనున్నాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండానే చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే, చర్చలకు బయలుదేరే సమయం మొదలు, చర్చలు జరిగే సమయం, తిరిగి వచ్చే వరకూ బెలారస్‌లోని అన్ని రకాల విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఎగరకుండా చూసే బాధ్యతను బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో తీసుకున్నారు’ అని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు తొలి అడుగు పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక రష్యా చేపట్టిన సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తుండడంతో ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది. ఇందుకు బెలారస్‌లోని గోమెల్‌లో చర్చిద్దామని ఉక్రెయిన్‌కు తెలిపింది. అయితే, రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచే తమ దేశంపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుందన్న ఆయన.. తమపై దాడి చేయని దేశాల్లో మాత్రమే చర్చిస్తామని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి తమ నిర్ణయాన్ని సమీక్షించుకున్న ఉక్రెయిన్‌.. చివరకు బెలారస్‌ సరిహద్దు ప్రాంతంలో చర్చించేందుకు అంగీకరించింది.

ఇదిలాఉంటే, తమ దేశంపై దాడుల నేపథ్యంలో రష్యాను ఐరాస భద్రతామండలి నుంచి తొలగించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌పై జరుగుతోన్న సైనిక చర్య ‘మారణహోమం’తో సమానమన్నారు. రష్యా తప్పుడు మార్గంలో వెళ్తున్నందున యూఎన్‌ఎస్‌సీలో దాని స్థానాన్ని తొలగించాలన్నారు. ఉక్రెనియాపై దాడులను అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ద్వారా దర్యాప్తు చేయించాలని, వాటిని ఉగ్రవాద చర్యలుగా పరిగణించాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సైనిక చర్యను వెంటనే ఆపివేసేలా రష్యాను ఆదేశించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని