Plane: బోయింగ్‌ విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు

Boeing: విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్‌ గేర్‌ టైర్‌ ఊడి కింద పడింది. పైలట్‌ అప్రమత్తతతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Updated : 09 Jul 2024 16:26 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఈ మధ్య బోయింగ్‌ (Boeing) విమానాల్లో వరుసగా సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురవడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ సంస్థ తయారుచేసిన మరో విమానం గాల్లోకి ఎగరిన కాసేపటికే టైరు (Tyre) ఊడి పడిపోయింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ (United Airlines)కు చెందిన బోయింగ్‌ 757-200 విమానం సోమవారం లాస్‌ఏంజిల్స్‌ (Los Angeles) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే, టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్‌ గేర్‌ టైర్‌ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి టైర్‌ ఊడిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటనపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ... ఊడిన టైరు లాస్‌ ఎంజిల్స్‌లో లభించిందని, ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది.

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చిలో ఇదే సంస్థకు చెందిన బోయింగ్‌ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌ బయల్దేరగా.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే టైర్‌ ఊడిపోయింది. దీంతో విమానాన్ని లాస్‌ ఏంజిల్స్‌లో అత్యవసరంగా దించేశారు. ఊడిన టైరు కార్ల పార్కింగ్‌లోని ఒక కారుపై పడి దాని అద్దాలు ధ్వంసమయ్యాయి.

బోయింగ్‌ విమానాలకు తరచూ ఇలాంటి ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్‌( Alaska Airlines)కు చెందిన బోయింగ్‌ విమానం గాలిలో ఉండగా డోర్‌ప్లగ్‌ ఊడిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులకు గాయాలు కావడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని