Chocolate: చనిపోతావని జాతకం చెప్పి.. చాక్లెట్‌తో చంపేసి..!

త్వరలో చనిపోతావని జోస్యం చెప్పి ఒక మహిళకు చాక్లెట్‌ ఇచ్చింది ఓ జ్యోతిష్కురాలు. ఆది తిన్న మహిళ కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. 

Updated : 03 Oct 2023 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అపరిచితులు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే తీసుకోకూడదంటూ చిన్న పిల్లలకు చెబుతుంటాం. కానీ, గుర్తు తెలియని ఓ జ్యోతిష్కురాలు (palm reader) ఇచ్చిన చాక్లెట్‌ (chocolate)తిన్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బ్రెజిల్‌ (Brazil)లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

మాసియో నగరంలో నివాసముంటున్న 27 ఏళ్ల ఫెర్నాండా వాలోజ్ పింటో తన చిన్నారితో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. దారిలో వెళుతుండగా జాతకం చెబుతానంటూ ఒక వృద్ధ మహిళ ఆమెను ఆపింది. తన వద్ద జాతకం చెప్పించుకోవాలంటూ పింటోను కోరింది. అందుకు అంగీకరించిన పింటో తన చేతిని ఆమెకు అందించింది. అది చూసిన వృద్ధ మహిళ ‘‘నువ్వు త్వరలో చనిపోతావు. ఇంకొన్ని రోజులే నీకు మిగిలి ఉన్నాయి’’ అని చెప్పింది.

అనంతరం జ్యోతిష్కురాలు పింటోకు బహుమతిగా చాక్లెట్‌ను ఇచ్చింది. తాను కూడా ఆలోచించకుండా దాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయింది. సదరు మహిళ ఇచ్చిన చాక్లెట్‌ను పింటో తినింది. అయితే, కొన్ని గంటల్లోనే ఆమెకు ఛాతిలో నొప్పి మొదలైంది. ఆ తర్వాత కళ్లు మసక బారాయి. ఈ క్రమంలోనే పింటో తన సోదరి బియాంకా క్రిస్టినాకు ఫోన్లో తన పరిస్థితి వివరించింది.

దీంతో ఆమె పరుగున బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. మార్గ మధ్యలో పింటో ముక్కు నుంచి రక్తం, నోటి నుంచి నురుగ వచ్చాయి. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పురుగుల మందులో ఉపయోగించే రెండు రసాయనాలు మృతదేహంలో గుర్తించడంతో పింటోను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసి జ్యోతిష్కురాలి కోసం గాలింపులు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని