Military secrets: ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!

ఒక డాలరు కంటే తక్కువతో కొనుగోలు చేసిన కొన్ని పాత పేపర్లలో ఆ దేశ సైనిక రహస్యాలు ఉన్నట్లు వెల్లడైంది.

Published : 13 Jun 2024 16:55 IST

బీజింగ్‌: చరిత్రకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపే ఓ వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురయ్యింది. ఒక డాలరు కంటే తక్కువతో కొనుగోలు చేసిన కొన్ని పాత పేపర్లలో ఆ దేశ సైనిక రహస్యాలు ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన అతడు.. అందులో ఉన్న సున్నిత అంశాల దృష్ట్యా వాటిని భద్రతా దళాలకు అందించాడు. చైనాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

బీజింగ్‌కు చెందిన ఝాంగ్‌కు చరిత్ర గురించిన విషయాలు తెలుకోవడం ఇష్టం. సైనిక అంశాలంటే మరింత ఆసక్తి. అదే మక్కువతో సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు విక్రయించే దుకాణం నుంచి ఇటీవల కొన్ని పాత పేపర్లను కొని తెచ్చుకున్నాడు. వాటి విలువ ఒక డాలరు కంటే తక్కువేనట. తెరిచి చూడగా.. అందులో ‘రహస్య’ సమాచారం అంటూ ముద్రించిన స్టాంపును చూశాడు. అవి సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారం ఉన్నట్లు గ్రహించాడు. వెంటనే వాటిని ఉన్నతాధికారులకు అప్పగించాడు. అయితే, ఆ దస్త్రాల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి? అవి ఎప్పటివనేది మాత్రం వెల్లడించలేదు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు.. పాత పుస్తకాలు, మ్యాగజైన్లు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్‌ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు

ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగ పరచడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ క్రమంలో స్థానికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దేశీయ, విదేశీ కన్సల్టెన్సీలపైనా అక్కడి భద్రతా విభాగాలు ఎప్పుడూ కన్నేసి ఉంచుతాయి. ఇదిలాఉంటే, కొన్నేళ్లుగా తమ సైనిక శక్తిని భారీగా పెంచుకుంటోన్న చైనా.. దక్షిణ చైనా సముద్రంలో అగ్రరాజ్యం అమెరికాకు సవాల్‌ విసురుతోంది. దీంతో తైవాన్‌కు సైనిక సహాయం అందిస్తోన్న అమెరికా.. అటు ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా వంటి మిత్ర దేశాలతోనూ బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు