China: చరిత్ర సృష్టించిన చైనా.. జాబిల్లికి ఆవలివైపు మట్టితో భూమిపైకి దిగిన చాంగే-6

China: భూమికి ఎన్నడూ కన్పించని జాబిల్లి రెండోవైపు నుంచి విజయవంతంగా మట్టి, శిథిలాలను మోసుకొచ్చింది చైనా వ్యోమనౌక. ఈ నమూనాలను భూమి మీదకు తీసుకురావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated : 25 Jun 2024 17:33 IST

బీజింగ్‌: చంద్ర మండల యాత్రల్లో చైనా (China) మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లి (Lunar Mission)కి ఆవలివైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకొని లూనార్‌ ల్యాండర్‌ చాంగే-6 (Chang'e 6) వ్యోమనౌక మంగళవారం భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు డ్రాగన్‌ వెల్లడించింది.

మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి.. దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్‌ 2న జాబిల్లి (Moon) ఆవలివైపున సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టి (Soil)ని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికి వచ్చేసింది.

చాంగే-6 (Chang'e 6) తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్‌ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు.

చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగం (నియర్‌ సైడ్‌)గా దాన్ని పేర్కొంటారు. రెండో పార్శ్యాన్ని ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్‌ సైడ్‌ నుంచి నమూనాలను (Lunar Samples) సేకరించి భూమికి తీసుకొచ్చాయి. అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి.

చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్‌ సెన్సింగ్‌ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని