Pakistan: పాక్‌ పెద్దలు.. స్విస్‌బ్యాంకులో దాచేశారు..!

పాకిస్థాన్ పెద్దలుగా చలామణీ అయిన కొందరి అవినీతి వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది.

Published : 22 Feb 2022 01:32 IST

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్ పెద్దలుగా చలామణీ అయిన కొందరి అవినీతి వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. 1,400 మందికి చెందిన 600 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రస్తుతం బయటకు పొక్కాయి. అందులో ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ జనరల్ అక్తర్ అబ్దుర్ రహమాన్ ఖాన్ సహా ఇతర జనరల్స్‌, బడా నేతల ఖాతాలున్నాయి. స్విట్జర్లాండ్‌లో రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ నుంచి ఈ వివరాలు లీక్‌ అయ్యాయి. దానికి సంబంధించి వెలువడిన నివేదికపై పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. 

అఫ్గానిస్థాన్‌లో రష్యాకు వ్యతిరేకంగా ముజాహిదీన్‌లు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బు, తదితరాలను అందించడంలో రహమాన్‌ ఖాన్ సహాయం చేశాడని ఆ నివేదికను ఉటంకిస్తూ న్యూయార్క్ కథనం పేర్కొంది. ముజాహిదీన్‌ల కోసం కోసం సౌదీ అరేబియా, యుఎస్ నుంచి వచ్చిన నిధులు అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) స్విస్ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని డాన్ వార్తాపత్రిక నివేదించింది. ఈ ప్రక్రియలో చివరి గ్రహీత పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఎస్‌ఐ). ఆ సమయంలో ఐఎస్‌ఐకు రహమాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నారని నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది.  

ఇక స్విట్జర్లాండ్‌లో పాకిస్థానీలు కలిగిఉన్న సగటు గరిష్ఠ నిల్వ 4.42 మిలియన్ స్విస్‌ ఫ్రాంక్‌లని మరో కథనం పేర్కొంది. వారిలో కొందరు రాజకీయ నాయకులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ పదవుల్లో ఉన్పప్పటికీ.. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఖాతా వివరాలు పేర్కొనలేదు.  2016లో పనామా పేపర్లు, 2017లో ప్యారడైజ్ పేపర్లు, గతేడాది పండోర పేపర్ల తర్వాత తాజా లీకుల వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సారి 18,000 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. వాటి విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఉందని సమాచారం. మరిన్ని ఖాతాలు ఉండటంతో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని