Monkeypox: కరోనా సోకిన వ్యక్తికి మంకీపాక్స్‌..! అమెరికాలో అరుదైన ఘటన

కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

Published : 25 Jul 2022 02:05 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ కొనసాగుతోన్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ (Monkeypox) కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ 75దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. ఇటువంటి సమయంలో అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని చెబుతున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ చివరివారంలో కరోనావైరస్‌ బారినపడ్డారు. జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగులో పొక్కులు రావడం మొదలైంది. దీంతో అనుమానించిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని.. వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

మరోవైపు మంకీపాక్స్‌ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఇప్పటికే 75దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ప్రజాఆరోగ్య అత్యవరసర పరిస్థితి విధించింది. ముఖ్యంగా మంకీపాక్స్‌ కేసుల్లో దాదాపు 95శాతానికిపైగా కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తున్నట్లు నివేదికలు రావడంతో అటువంటి పురుషులను కీలకంగా పరిశీలిస్తుండాలని సూచించింది. ఇప్పటివరకు 16వేల కేసులు నమోదుకాగా ఐదు మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో కరోనా వైరస్‌ సోకిన వారికి మంకీపాక్స్‌ సోకుతోందని వార్తలు వస్తుండటం ఆందోళన కలిగించే విషయమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని