పాక్‌ ఉగ్రవాది విడుదల కోసం అమెరికాలో దుండగుడి 10గంటల వీరంగం

తుపాకి సహా పేలుడు పదార్థాలు కలిగిన ఓ దుండగుడు శనివారం యావత్‌ అమెరికాను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. నలుగురు వ్యక్తులను బందీలుగా చేసుకొని దాదాపు ఎనిమిది గంటల పాటు వీరంగం సృష్టించాడు...

Updated : 16 Jan 2022 13:14 IST

టెక్సాస్‌: తుపాకి సహా పేలుడు పదార్థాలు కలిగిన ఓ దుండగుడు శనివారం యావత్‌ అమెరికాను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. నలుగురు వ్యక్తులను బందీలుగా చేసుకొని దాదాపు పది గంటల పాటు వీరంగం సృష్టించాడు. స్థానిక పోలీసులు, అమెరికా ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడంతో ఎట్టకేలకు పరిస్థితి సుఖాంతం అయ్యింది. బందీలు సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముష్కరుడు వారికి ఎలాంటి హాని తలపెట్టకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

డల్లాస్‌కు కొద్ది దూరంలో ఉన్న కోలీవిల్‌ పట్టణంలోని ‘సినగాగ్‌’గా పిలిచే యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ సాయుధుడైన దుండగుడు శనివారం ఉదయం 10:30 (అమెరికా కాలమానం ప్రకారం) గంటల సమయంలో చొరబడ్డాడు. అందులో ఉన్న ‘రబ్బీ’గా పిలిచే మతగురువు సహా నలుగురు వ్యక్తుల్ని బందీలుగా చేసుకున్నాడు. తర్వాత ఓ వీడియోను బయటకు వదిలాడు. అమెరికా జైల్లో ఉన్న ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాది ఆఫియా సిద్ధిఖీని వదిలిపెట్టాలని ముష్కరుడు అందులో డిమాండ్‌ చేసినట్లు కోలీవిల్‌ పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ప్రత్యేక దళాలైన స్వాట్‌ టీం.. కోలీవిల్‌ పోలీసులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చింది. దుండగుడితో మాట్లాడి బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో ముష్కరుడితో ప్రత్యేక దళాలు చర్చలు కొనసాగించాయి. 

ముష్కరుడు విడుదల చేసిన వీడియోలో తన వద్ద పేలుడు పదార్థాలు, తుపాకీ ఉన్నట్లు పేర్కొన్నాడు. తన వేషధారణను చూసిన పోలీసుల అది నిజమే అని భావించి తదుపరి చర్యలు చేపట్టారు. అయితే, అతని వద్ద నిజంగానే ఆయుధాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించుకోలేకపోయారు. అయితే, బందీల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బలగాలు ఆచితూచి వ్యవహరించాయి. ఈ క్రమంలో ఒక బందీని దుండగుడు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. చివరకు శనివారం రాత్రి 9:30 గంటలకు అందరూ క్షేమంగా రావడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే, వారిని విడిచిపెట్టడానికి ముందుకు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. బహుశా ముష్కరుడిని హతమార్చేందుకు బలగాలు జరిపిన కాల్పులే అయి ఉంటాయని భావిస్తున్నారు! ఇప్పటి వరకు ముష్కరుడి వివరాలను అమెరికా బలగాలు వెల్లడించలేదు. 

సంఘటనా స్థలంలోని పరిస్థితిని శ్వేతసౌధం ఎప్పటికప్పుడు సమీక్షించింది. స్వయంగా అధ్యక్షుడు బైడెన్‌ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సైతం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. బందీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

ఎవరీ ఆఫియా సిద్ధిఖీ...

ఉగ్రవాద చర్యలు, అమెరికా సైనికులపై హత్యాయత్నం కేసులో ఆఫియా సిద్ధిఖీకి 86 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ అమెరికా కోర్టు. కోలీవిల్‌కు సమీపంలో ఉన్న ఫోర్ట్‌ వర్త్‌ అనే నగరంలోని ఓ కారాగారంలో ఆమె ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సిద్ధిఖీ ఓ న్యూరోసైంటిస్ట్‌. ఈమె అమెరికాలోని ఎంఐటీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించింది. 9/11 దాడుల తర్వాత అమెరికా బలగాలకు ఈమె కదలికలపై అనుమానం వచ్చింది. 2004లో ఆమెను అల్‌ఖైదా ఉగ్రవాదిగా ప్రకటించింది. చివరకు 2008లో అమెరికా బలగాలు సిద్ధిఖీని అఫ్గానిస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నాయి. ఆమె దగ్గర ‘డర్టీ బాంబ్‌’ తయారీకి సంబంధించిన చేతిరాత ప్రతులు దొరికినట్లు పేర్కొన్నారు. వాటిని అమెరికాలో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అమర్చాలనే కుట్రకు సంబంధించిన ప్రణాళికలూ లభ్యమైనట్లు తెలిపారు. అలాగే విచారణ సమయంలో సైనికుల దగ్గర నుంచి ఓ తుపాకీని లాక్కొని దాడి చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. వీటిపై విచారణ జరిపిన ఓ అమెరికా కోర్టు 2010లో ఆమె నేరాన్ని ధ్రువీకరించి శిక్షను ఖరారు చేసింది.

తీర్పు వెలువరించిన సమయంలో సిద్ధిఖీ ప్రపంచ శాంతి వచనాలు వల్లెవేయడం గమనార్హం. మరోవైపు విచారణ సమయంలో తన తరఫున వాదించిన న్యాయవాదుల వాదనలతోనూ ఆమె విభేదించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్నారన్న న్యాయవాదుల వాదనను ఆమె తోసిపుచ్చింది. సిద్దిఖీకి శిక్ష విధించడాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. అప్పటి ప్రధాని యుసఫ్‌ రజా గిలానీ ఆమెను విడుదల చేయాలనీ డిమాండ్‌ చేశారు. అప్పటి నుంచి తర్వాత వచ్చిన ప్రధానులు సైతం ఆమె విడుదల కోసం అమెరికాతో చర్చలు జరిపారు.

మరోవైపు ఓ నేరంలో 2018లో పట్టుబడిన ఉగ్రవాది.. సిరియాలో శిక్షణ పొందిన తనకు సిద్ధిఖీని విడిపించడం కూడా ఓ లక్ష్యమని అంగీకరించాడు. అందుకోసం ఆమె ఉన్న జైల్‌పై దాడి చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు వివరించాడు. తర్వాత అతనికి అమెరికా కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక సిద్ధిఖీపై ఇటీవల జైల్లో తోటి ఖైది దాడి చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని