Missile: పోలండ్‌లో పేలిన క్షిపణి.. ఉక్రెయిన్‌ నుంచి దూసుకెళ్లింది..!

ఉక్రెయిన్‌ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో పోలండ్‌లోని ఓ గ్రామంలోకి క్షిపణి దూసుకువచ్చిందని ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇది ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన క్షిపణేనని ప్రాథమికంగా తెలిసింది.

Updated : 16 Nov 2022 12:37 IST

వార్సా: రష్యా-ఉక్రెయిన్‌ యద్ధంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ జి-20 సదస్సులో మాట్లాడుతున్న వేళ.. ఆ దేశంపై క్షిపణులు వర్షం కురిసింది. వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆ క్రమంలో క్షిపణి ఒకటి పొరుగున ఉన్న పోలండ్‌ దేశంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఇది రష్యా నుంచి వచ్చిందని మొదట వార్తలు వచ్చినా.. అది ఉక్రెయిన్‌ ప్రయోగించిన క్షిపణేనని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఉక్రెయిన్‌ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో పోలండ్‌లోని ఓ గ్రామంలోకి క్షిపణి దూసుకువచ్చిందని ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇది రష్యాలో తయారైన క్షిపణి అని తెలిపింది. అలాగే ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు జారీచేసింది. అయితే దీనిని రష్యా ఖండించింది. ఇదంతా ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టే చర్య అంటూ నిందించింది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాజం సహా పలు దేశాలు జి-20 సదస్సులో బిజీగా ఉన్నాయి. ఈ వార్తతో అమెరికా అధ్యక్షతన జి-20 దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడించారు. అలాగే రష్యా నుంచి ప్రయోగించిన క్షిపణి వల్ల ఈ ఘటన చోటుచేసుకొని ఉండకపోవచ్చని ప్రాథమికంగా తెలుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోలండ్‌లో మిలిటరీని హై అలర్ట్‌లో ఉంచారు.  

స్పందించిన ఉక్రెయిన్‌..

ఈ ఘటనపై మంగళవారం జెలెన్‌స్కీ రష్యాపై విమర్శలు గుప్పించారు. ‘రష్యా క్షిపణులు పోలండ్‌లోకి దూసుకెళ్లాయి. మరణాలు చోటుచేసుకున్నాయి. ఇది కీలక  ఉద్రిక్త పరిస్థితి. నాటో దేశంపై రష్యా క్షిపణి పేలడం అనేది సామూహిక భద్రతపై దాడి’ అని తన దేశ ప్రజలతో వ్యాఖ్యానించారు. మరోపక్క ఉక్రెయిన్‌ నుంచి ఈ క్షిపణి వచ్చిందన్న తాజా నివేదికలపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇది కుట్ర సిద్ధాంతం అంటూ వాటిని కొట్టిపారేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని