Viral Video: పట్టాలపై కూలిన విమానం.. ఎదురుగా దూసుకొస్తున్నరైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

దురదృష్టం.. అదృష్టం కలిసొస్తే ఇలానే ఉంటుంది.. ఓ చిన్న విమానం పోయిపోయి రైలు పట్టాలపై కూలిపోయింది.. అందులో ఇరుక్కుపోయిన పైలట్‌ను పోలీసులు ఇలా బయటకు లాక్కోచ్చారో లేదో..

Updated : 11 Jan 2022 21:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దురదృష్టం.. అదృష్టం ఒకేసారి కలిసొస్తే ఇలానే ఉంటుంది. ఓ చిన్న విమానం పోయిపోయి రైలు పట్టాలపై కుప్పకూలింది. అందులో ఇరుక్కుపోయిన పైలట్‌ను పోలీసులు ఇలా బయటకు లాక్కొచ్చారో లేదో.. క్షణాల్లో ఓ రైలు వేగంగా ఆ విమాన శకలాన్ని ఢీకొంటూ వెళ్లిపోయింది. ఏ యాక్షన్‌ సినిమాకు తీసిపోని విధంగా ఉన్న ఈ సహజ దృశ్యం మొత్తం ఓ పోలీస్‌ అధికారి బాడీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

లాస్‌ఏంజెల్స్‌లోని రైల్‌ రోడ్‌ ట్రాక్‌లో పట్టాలపై ఆదివారం ఓ చిన్న సెస్నా 172 విమానం కూలిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో చోటు చేసుకొంది. ఫెడరల్‌ ఏవియేషన్‌ సమాచారం ప్రకారం విమానం స్థానిక ఫెర్నాండో వెల్లి కమ్యూనిటీ నుంచి టేకాఫ్‌ అయ్యింది. తర్వాత ఎల్‌ఏపీడీ ఫుట్‌హిల్‌ డివిజన్‌ స్టేషన్‌ వద్ద రైల్‌ రోడ్‌పై ఇది కూలిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న నలుగురు పోలీసు అధికారులు విమానంలో గాయపడి ఇరుక్కుపోయిన పైలట్‌ను బయటకు లాగారు. మరోవైపు అదే మార్గంలో రైలు దూసుకొస్తున్నా.. ఈ అధికారులు ప్రాణాలకు తెగించి పైలట్‌ను రక్షించారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యం చూసి..  ‘గో.. గో.. గో..’ అని వారిని హెచ్చరిస్తున్నారు. పైలట్‌ను 2.15 సమయంలో బయటకు లాగగానే.. క్షణాల్లోనే ఆ రైలు వేగంగా ఆ విమనాన్ని ఢీకొని నుజ్జునుజ్జు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని