Viral Video: మాల్‌ మూసేస్తున్నారని, హడలెత్తి పారిపోయిన ప్రజలు..!

చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానంతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క కేసు వచ్చినా.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రాగన్ దేశం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది.

Published : 16 Aug 2022 14:15 IST

షాంఘై: చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానంతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క కేసు వచ్చినా.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రాగన్ దేశం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తోంది. ఇదే మాదిరిగా షాంఘైలోని గ్జుయిలోని ఐకియా స్టోర్‌ను అధికారులు లాక్‌ చేయడానికి ప్రయత్నించగా.. హడలెత్తిపోయిన ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని శనివారం ఈ ఐకియా స్టోర్‌ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. దాంతో ఈ స్టోర్‌కు వచ్చిన ప్రజలందరిని క్వారంటైన్ చేయాలని వారు ప్రయత్నించారు. తలుపులు లాక్‌ చేయాలని చూడగా ఆందోళన చెందిన ప్రజలు.. అధికారులు, భద్రతా సిబ్బందిని తోసుకుంటూ అక్కడి నుంచి వేగంగా బయటకు పరిగెత్తారు. అదే వేగంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ‘శనివారం ఐకియా వద్ద కరోనా సోకిన వ్యక్తి క్లోజ్‌కాంటాక్ట్‌ను గుర్తించారు. దాంతో అధికారులు మాల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ కారణం చెప్పి, తమను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారని ఆందోళన చెందిన ప్రజలు అక్కడి నుంచి బయటకు పరిగెత్తారు. కానీ వారిపై డిజిటిల్‌ నిఘా ఉంటుందిగా..!’ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే షాంఘై వాసులు రెండు నెలల కఠిన లాక్‌డౌన్‌ను అనుభవించారు. ఆ సమయంలో ఆహారం అందక, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి కిటికీల వద్ద నిలబడి అసహనం వెళ్లగక్కిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. కాగా, తాజా ఘటనపై ఐకియా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని