Modi - Putin: మోదీ-పుతిన్‌ గోల్ఫ్‌ కారులో షికారు.. నెట్టింట వీడియో చక్కర్లు

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi)కి అధ్యక్షుడు పుతిన్ అతిథి మర్యాదలు చేశారు. వెంట ఉండి తన నివాసాన్ని చూపించారు. 

Updated : 09 Jul 2024 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi)కి విశేష ఆదరణ లభిస్తోంది. అధ్యక్షుడు పుతిన్ (Putin) వెంటే ఉండి, తన అధికారిక నివాసాన్ని చూపించారు. ఆ సమయంలో వారిద్దరూ గోల్ఫ్‌కార్ట్‌లో షికారు చేశారు. ఆ ఇంటి ప్రాంగణంలో తిరుగుతూ ముచ్చటించుకున్నారు.

రాజధాని నగరం మాస్కో సమీపంలోని నోవో ఓగర్యోవోలో పుతిన్ అధికారిక నివాసం ఉంటుంది. సోమవారం రష్యాలో దిగిన మోదీకి ఉప ప్రధాని డెనిస్‌ మంత్రోవ్‌ స్వాగతం పలికారు. అనంతరం పుతిన్‌ తన ఇంటికి ఆహ్వానించారు. టెర్రస్‌పై కూర్చొని ఇద్దరూ తేనీరు సేవించారు. తర్వాత మోదీని గోల్ఫ్‌కార్ట్‌ (గోల్ఫ్‌కారు)లో తిప్పుతూ తన ఇంటి ప్రాంగణాన్ని చూపించారు. ఆ కార్ట్‌లో మోదీని పక్కన కూర్చోబెట్టుకొని పుతిన్ డ్రైవ్‌ చేశారు. వెనక సీటులో రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూర్చొన్నారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి.. మోదీతో విందులో పుతిన్‌ నిర్ణయం

తర్వాత కార్ట్‌ దిగి, వారిద్దరే ముచ్చటించుకుంటూ కొద్దిదూరం నడిచారు. ఆ క్షణాలు తనకెంతో ఆనందాన్నిచ్చాయని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా వారిద్దరూ అనువాదకుల సహాయంతో తమ అభిప్రాయాలు పంచుకున్నప్పటికీ.. ఇద్దరే కలిసి నడుస్తున్నప్పుడు మాత్రం ఆంగ్లంలో సంభాషించుకున్నట్లు స్థానిక మీడియా కథనం పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ప్రైవేటు ఈవెంట్‌ను ఇద్దరు సన్నిహిత మిత్రులు, విశ్వసనీయ భాగస్వాముల మధ్య జరిగిన సమావేశంగా అభివర్ణించింది. అలాగే వారి స్నేహాన్ని తెలిపే చిత్రాలను పోస్టు చేసింది. 

అలాగే పుతిన్‌ భారత్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రతి ఏడాది మీ దేశంలో 23 మిలియన్ల మంది జన్మిస్తున్నారు. భారతీయులు తమ భవిష్యత్తు గురించి ప్లాన్‌ చేసుకుంటున్నారని దానర్థం’’ అని జననాల రేటు గురించి మోదీ వద్ద ప్రస్తావించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు