Earthquake: తుర్కియే భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..!

తుర్కియే భూకంపం (Turkey Earthquake) ఎన్నో వేల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా రూ. లక్షల కోట్ల నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఆ అక్కడ ఓ గ్రామం రెండుగా చీలిపోయింది.

Updated : 19 Feb 2023 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలో భూకంపం (Turkey Earthquake) సృష్టించిన విలయం వేల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వీటితోపాటు వేల కొద్ది భవనాలు నేలమట్టం కావడంతోపాటు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చాలా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమై ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. ఈ క్రమంలో తుర్కియేలోని దెమిర్‌కొప్రు అనే గ్రామం భూకంప తీవ్రతకు రెండుగా చీలిపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, అక్కడ ప్రాణనష్టం మాత్రం జరగకపోవడం ఊరట కలిగించే విషయం.

దెమిర్‌కొప్రు అనే గ్రామంలో వెయ్యి మంది జనాభా నివసిస్తోంది. ఫిబ్రవరి 6 రోజున సంభవించిన భూప్రకంపనలతో అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురైన స్థానికులు బయటకు వచ్చి పరుగులు తీశారు. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఇళ్ల మధ్య నుంచి చీలిక వచ్చింది. పలు చోట్ల భూభాగం కొన్ని మీటర్ల లోతుకు కుంగిపోయింది. దీంతో చాలా ఇళ్లు అందులో కుంగిపోయాయి. భారీగా ఆస్తినష్టం సంభవించినప్పటికీ.. అదృష్టవశాత్తు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. కొందరు మాత్రం గాయాలతో బయటపడ్డారు.

దెమిర్‌కొప్రుకు సుమారు 20కి.మీ దూరంలో ఉన్న ఆంటక్యా గ్రామం ఉంది. చారిత్రక నగరమైన ఈ ప్రాంతంలోనూ భూకంపం ప్రభావం అధికంగా ఉంది. ప్రకంపనల ధాటికి అక్కడి ఇళ్లు, రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భూమిలోనుంచి నీరు పొంగుకు వచ్చిందని స్థానికులు వెల్లడించారు. అయితే, ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలాఉంటే, తుర్కియే, సిరియాలో కలిపి ఇప్పటివరకు 46వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని