GGR: 48 వేల కి.మీలు.. 236 రోజులు.. కఠిన రేసులో భారతీయుడి సత్తా!

విశ్రాంత నౌకాదళ అధికారి కమాండర్‌ అభిలాష్‌ టోమీ చరిత్ర సృష్టించారు. సెయిలింగ్‌లో ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఆయన రికార్డులకెక్కారు.

Published : 29 Apr 2023 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్రాంత నౌకాదళ (Indian Navy) అధికారి కమాండర్‌ అభిలాష్‌ టోమి (Abhilash Tomy) చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌ (Golden Globe Race)’ పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఆయన రికార్డులలెక్కారు. గతేడాది సెప్టెంబర్ 4న ఫ్రాన్స్‌ (France)లోని ‘లెస్ సాబుల్స్ ది ఒలోన్‌’ పోర్టు నుంచి ప్రారంభమైన ఈ సోలో ప్రపంచ సెయిలింగ్ రేసు (Solo Sailing Race)లో టోమీ రెండో స్థానంలో నిలిచారు. చిన్న పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్ (GGR)’కు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సెయిలింగ్ రేసుగా పేరుంది. మొత్తం 26 వేల నాటికల్ మైళ్ల (48 వేల కి.మీలు) దూరాన్ని అభిలాష్‌.. 236 రోజుల, 14 గంటల వ్యవధిలో పూర్తి చేశారు.

టోమీ నిత్య ప్రయాణికుడు. నావికుడిగా, నేవీ పైలట్‌గా ఆయనకు అనుభవం ఉంది. 12 ఏళ్ల వయసులోనే థర్మాకోల్‌తో సొంతగా పడవను నిర్మించుకున్నారు. 2018లో ఈ రేసులోనే ఓసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన వెన్నెముకలో టైటానియం రాడ్‌ కూడా అమర్చారు. కానీ, ఎక్కడా వెనకడుగేయలేదు. 44 ఏళ్ల వయసులో.. 1968 కాలంనాటి సాంకేతికతతో పనిచేసే పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. మధ్యలో ఎన్నో ప్రకృతి విపత్తులు, పడవ మరమ్మతులు.. వాటన్నింటికీ వినూత్న పరిష్కారాలు కనుగొని విజయవంతంగా రేసు పూర్తి చేశారు. రేసు ప్రారంభంలో 16 మంది నావికులుండగా.. చివరకు ముగ్గురు మాత్రమే మిగిలారు. దక్షిణాఫ్రికాకు చెందిన కిర్‌స్టెన్ న్యూషాఫర్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఈ రేసులో ఆమె ఏకైక మహిళ కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని