ChatGPT: చాట్‌జీపీటీ తప్పుడు సమాచారం.. కోర్టుకు సారీ చెప్పిన లాయర్‌!

చాట్‌జీపీటీ(ChatGPT) కారణంగా ఓ న్యాయవాది.. కోర్టుకు క్షమాపణ చెప్పిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాల కోసం న్యాయవాది చాట్‌జీపీటీని ఆశ్రయించగా.. సగానికిపైగా తప్పుడు వివరాలే ఉన్నాయి. దీంతో చాట్‌జీపీటీ వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. 

Updated : 10 Jun 2023 21:53 IST

న్యూయార్క్‌: ఇంటర్నెట్‌లో సరికొత్త సాంకేతికత చాట్‌జీపీటీ(ChatGPT)పై ఆధారపడుతున్నారా? దాన్ని అడిగే సమాచారం సేకరిస్తున్నారా? అయితే.. అది ఇచ్చే ఫలితాల్ని ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోండి. లేదంటే.. ఇబ్బందుల్లో పడతారు. తాజాగా చాట్‌జీపీటీని నమ్ముకున్న ఓ న్యాయవాది(Lawyer).. కోర్టులో న్యాయమూర్తి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..

మాన్‌హట్టన్‌(Manhattan)కు చెందిన ఓ వ్యక్తి విమాన సంస్థపై దావా వేశాడు. 2019లో కొలంబియన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో సిబ్బంది కారణంగా తన కాలుకు గాయమైందని.. పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. అతడి తరఫున న్యాయవాది స్టీవెన్‌ ష్వార్జ్‌ కోర్టులో వాదిస్తున్నారు. తాజాగా మాన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్ట్‌లో వాదనలు వినిపిస్తూ గతంలో ఇలాంటి దావాలకు సంబంధించి కేసు వివరాలను కోర్టుకు సమర్పించగా.. అవన్నీ నకిలీవని తేలింది. 

కేసు వాదనలకు ముందు ష్వార్జ్‌ ఇలాంటి దావాలకు సంబంధించి గతంలో కోర్టు తీర్పులను సేకరించేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించాడు. దాదాపు 12 కేసుల వివరాలు కోర్టుకు సమర్పించాడు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి.. అందులో 6 కేసులు బోగస్‌గా గుర్తించారు. లేని కేసులను ఉన్నట్లు చూపించినందుకు ష్వార్జ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పొరపాటు గుర్తించిన ష్వార్జ్‌ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. తనకొకరు చాట్‌జీపీటీ గురించి చెప్పగా తొలిసారి దీన్ని ఉపయోగించినట్లు తెలిపారు. చాట్‌జీపీటీ ఇచ్చిన ఫలితాల్ని సమీక్షంచుకోకపోవడం వల్లే పొరపాటు జరిగింది కానీ.. కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కోర్టు తనని మన్నించాలని కోరారు. ఈ ఘటనపై చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇంకా స్పందించలేదు. దీంతో చాట్‌జీపీటీ వినియోగం మరోసారి చర్చనీయాంశమైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు