BJP MLA: ముందస్తు బెయిల్‌ విచారణ అంత త్వరగానా..? సీజేఐకు న్యాయవాద సంఘం లేఖ

లంచం కేసులో (Corruption Case) ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా ఎమ్మెల్యే (Virupakshappa) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను అత్యంత త్వరగా విచారించడంపై బెంగళూరు న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వీఐపీల కేసులకు ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాసింది.

Published : 08 Mar 2023 19:33 IST

బెంగళూరు: లంచం కేసులో (Corruption Case) ఏ1గా ఉన్న కర్ణాటక భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పకు (Virupakshappa) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ త్వరగా విచారణకు రావడంపై బెంగళూరు న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన న్యాయవాద సంఘం.. అందరికీ సమన్యాయం ఉండాలంటూ అందులో పేర్కొంది.

‘కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్‌ వంటి కొత్త అంశాలకు సంబంధించిన పిటిషన్లు విచారణకు వచ్చేందుకు చాలా రోజులు, కొన్ని వారాలు పడుతుంది. కానీ, వీఐపీ విషయాల్లో మాత్రం ఇవి రాత్రికి రాత్రే విచారణకు వస్తాయి. సామాన్యులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయేందుకు ఈ తరహా సంఘటనలు దారి తీస్తాయి. ఎమ్మెల్యేను కూడా సాధారణ పౌరుడి మాదిరిగానే చూడాలి’ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కర్ణాటక అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వివేక్‌ సుబ్బారెడ్డి, జనరల్‌ సెక్రటరీ టీజీ రవి నేతృత్వంలోని అడ్వకేట్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

మరోవైపు ముందస్తు బెయిల్‌పై వచ్చే దరఖాస్తులన్నీ ఒకేరోజు విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖలోనూ బెంగళూరు అడ్వకేట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. తద్వారా సామాన్యులను కూడా వీఐపీగా పరిగణించవచ్చని పేర్కొంది. కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త చేతికి చిక్కిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్పకు ముందస్తు బెయిల్‌ మంజూరు కావడాన్ని న్యాయవాద సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.

ఇదిలాఉంటే, ఎమ్మెల్యే విరూపాక్షప్ప తరఫునే ఆయన కుమారుడు ప్రశాంత్‌ లంచం తీసుకున్నారని లోకాయుక్త అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షప్పను ఏ1గా చేర్చింది. అదుపులోకి తీసుకునేందుకు లోకాయుక్త ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో తన పాత్ర లేదంటూ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. దానిని విచారించిన జస్టిస్‌ కే నటరాజన్‌ ఏకసభ్య ధర్మాసనం ఎమ్మెల్యేకు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని